న్యూఢిల్లీ: అంతర్జాతీయ పౌర విమానాల సర్వీసుల్ని డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరిస్తున్నట్టుగా కేంద్ర విమానయాన శాఖ శుక్రవారం ప్రకటించింది. కోవిడ్ సంక్షోభంతో గత ఏడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్రం పూర్తిగా దానిని ఎత్తేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలంటూ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ (డీసీజీఏ)కి కేంద్ర విమానయాన శాఖ లేఖ రాసింది.
‘డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సర్వీసుల్ని పునరుద్ధరణ కోసం హోంశాఖ, విదేశాంగ శాఖ, ఆరోగ్య శాఖలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం’ అని విమానయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించినప్పటికీ గత ఏడాది జూలై నుంచి వందే భారత్ పేరుతో కొన్ని ప్రత్యేక విమానాలను నడిపిస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న 28 దేశాలకు ఈ ప్రత్యేక విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని విమానాలను పునరుద్ధరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment