సాక్షి, ముంబై : కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఆశలు చిగురుస్తున్నాయి. మరోవైపు ఈ వ్యాక్సిన్ ఖరీదు ఎంత ఉంటుంది సామాన్యులకు అందుబాటులో ఉంటుందా అనే ఆందోళన కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ ఛైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యయాన్ని భరించేందుకు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని సూచించారు. ప్రధానంగా ఐరాస భద్రతా మండలి సభ్య దేశాలు ఈ ఖర్చులో ప్రధాన భాగాన్ని పంచుకోవాలని నారాయణమూర్తి కోరారు. (అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో రెండు కరోనా వ్యాక్సిన్లు)
కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు, త్వరలోనే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ మూర్తి వ్యాక్సిన్లను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ల ఉత్పత్తికయ్యే ఖర్చును సంస్థలు భరించాలని, భారీ లాభాలను ఆశించకూడదన్నారు. ఐక్యరాజ్య సమితి లేదా దేశాలు చెల్లించాలని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. అంతేకాదు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అందరికీ ఉచితంగా కోవిడ్-19 వ్యాక్సిన్ అంటూ ఈ సందర్బంగా బిహార్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బీజేపి ఎన్నికల హామీని ఆయన గుర్తు చేయడం గమనార్హం. దీంతో పాటు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం విధానంపై ఆయన పెదవి విరిచారు. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లను తిరిగి తెరవాలని కూడా మూర్తి సూచించారు. (కీలక దశకు దేశీయ కరోనా వ్యాక్సిన్)
మోడెర్నా, ఫైజర్ తదితర విదేశీ కరోనా వైరస్ వ్యాక్సిన్లు 90-95 శాతం వరకు ఆశాజనకమైన పనితీరు కనబరిచినట్టు ప్రకటించాయి. మోడెర్నా, ఫైజర్ రూపొందించిన రెండు డోసుల వ్యాక్సిన్లను ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన భారత ప్రజలకే దాదాపు 300 కోట్ల డోసులు అవసరం. మరోవైపు దేశీయంగా భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్ మూడవ దశ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment