
సూళ్ళూరుపేట/సాక్షి బెంగళూరు: గగన్‌యాన్ ప్రాజెక్టు పరిశోధనా పరీక్షల్లో భాగంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటనామస్ ల్యాండింగ్ మిషన్(ఆర్‌ఎల్‌వీ–ఎల్‌ఈఎక్స్) రాకెట్ ప్రయోగ పరీక్షలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కుందాపురం సమీపంలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్)లో ఈ పరీక్ష చేపట్టారు.
భారత వైమానిక దళానికి సంబంధించిన చినోక్ అనే హెలికాప్టర్ సహాయంతో ఆర్‌ఎల్‌వీ రాకెట్‌ను ఉదయం 7.10 గంటలకు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఆర్‌ఎల్‌వీ–ఎల్‌ఈఎక్స్‌లోని మిషన్ మేనేజ్‌మెంట్ కంప్యూటర్ కమాండ్ ఆధారంగా రాకెట్ తిరిగి 7.40 గంటలకు భూమిపై నిర్దేశిత ప్రాంతంలో క్షేమంగా ల్యాండయ్యింది. ముందస్తుగా సిద్ధం చేసి రూపొందించిన నేవిగేషన్, గైడెన్స్, నియంత్రణ వ్యవస్థల సహాయంతో ఈ మానవ రహిత లాంచింగ్ వాహనం ఎలాంటి ఆటంకం లేకుండా భూమిపైకి చేరింది.
ఈ ప్రయోగంలో ఇస్రోతోపాటు డీఆర్‌డీవో, భారత వైమానిక దళం కూడా భాగస్వామిగా మారింది. ప్రపంచంలోనే మొదటిసారిగా హెలికాప్టర్ సహాయంతో ఆర్‌ఎల్‌వీ లాంటి రాకెట్‌ను ఆకా«శంలో వదిలి, తిరిగి విజయవంతంగా భూమి మీదకు చేర్చిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఆర్‌ఎల్‌వీ ప్రాజెక్టు నిర్వహణ బృందాన్ని ఆయన అభినందించారు. 2016 మే 23న ఆర్‌ఎల్‌వీ–టీడీ పేరుతో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024 ఆఖరుకు గగన్‌యాన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించిన ఇస్రోకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.
ప్రయోగ రాకెట్ ల్యాండ్ అయిన దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment