
న్యూఢిల్లీ: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు యోగా ఆవశ్యకతను చాటే కార్యక్రమాలను ప్రారంభించాయి. ఇక మనదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు యోగాసానాలు సాధన చేస్తూ.. దాని గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీబీపీ అధికారి ఒకరు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాన్ని ప్రదర్శించారు. గడ్డకట్టే చలిలో 18 వేల అడుగుల ఎత్తున సూర్యనమస్కారాలు చేశారు. అది కూడా కేవలం షార్ట్ మీదనే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘‘కరోనాతో భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్ష కవచంగా మార్చుకోవాలి. యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్య సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిన దృఢత్వాన్ని యోగా పెంపొదిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది’’ అంటూ యోగా గొప్పతనాన్ని తెలిపారు.