పెళ్లి అంటే సాధారణంగా ఓ అమ్మాయి.. ఓ అబ్బాయి కలిసి చేసుకునే వేడుక. ఇదే మనకు ఎక్కువగా తెలిసిన పెళ్లి. కానీ ఇద్దరు అమ్మాయిలు.. లేదా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో స్వలింగ వివాహాలను ప్రభుత్వాలు ఆమోదించాయి. వీటిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియయా, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బెల్జియం, కెనడా, కొలంబియా, స్పెయిన్, జర్మనీ, దక్షిణాఫ్రికా, నార్వే, స్వీడన్, పోర్చుగల్, ఐర్లాండ్, మెక్సికో, డెన్మార్క్, ఉరుగ్వే ఉన్నాయి.
స్వలింగ వివాహాలు విదేశాల్లో సహజమే అయినా.. భారత్‌లో మాత్రం విచిత్రంగానే పరిగణిస్తారు. అంతేగాక సమాజం, తల్లిదండ్రులు కూడా ఇలాంటి పెళ్లిళ్లను వ్యతిరేకిస్తారు. అయితే తాజాగా ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ప్రేమించుకొని ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో చోటుచేసుకుంది. జోరఖ్‌పుల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జామాడోబాలో ఉంటున్న రాఖిమిర్ధా (24), కరిష్మా రావత్ (23) ఇద్దరు స్నేహితులు. వీరి పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాము ప్రేమించుకుంటున్నామని, జీవితాంతం కలుసుండాలనుకుంటున్నామని పోలీసులకు చెప్పారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి స్టేషన్‌కు పిలించారు. స్టేషన్‌కు వెళ్లిన ఇరు కుటుంబసభ్యులు వారి నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. ఎన్నో గంటల పాటు సర్దిచెప్పడంతో తమ తమ ఇళ్లకు వెళ్లడానికి ఆ అమ్మాయిలు ఒప్పుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని ఇంటికి తీసుకెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment