సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలకూ ప్రధాన పార్టీలు టికెట్లిచ్చిమరీ ఎన్నికల బరిలో నిలిపాయి. ఈసారి పోటీ చేసే అభ్యర్థుల్లో 581 మంది (22 శాతం) నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఉండటం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ 581 మంది నేతల్లో 404 మందిపై తీవ్రమైన నేరారోపణలు నమోదై ఉన్నాయి. ఈసారి శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలుచేసిన 2,613 మందిలో 2,586 మంది అభ్యర్థుల నామినేషన్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ పరిశీలించి సంబంధిత గణాంకాలను విడుదలచేసింది.
నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు..
► బీజేపీ తరఫున 224 మంది నామినేషన్లు వేయగా అందులో 96 మందిపై కేసులున్నాయి. మొత్తం 223 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 122 మందిపై కేసులున్నాయి. మొత్తం 208 మంది జేడీఎస్ అభ్యర్థుల్లో 70 మందిపై, 208 ఆప్ అభ్యర్థుల్లో 48 మందిపై, 9 మంది ఎన్సీపీ అభ్యర్థుల్లో ఇద్దరిపై, ముగ్గురు సీపీఐ అభ్యర్థుల్లో ఒకరిపై, 901 స్వతంత్ర అభ్యర్థుల్లో 119 మందిపై కేసులున్నాయి.
► గతంలో పోలిస్తే బీజేపీ, జేడీఎస్‌లు ఎక్కువ మంది నేరచరితులకు టికెట్లు ఇచ్చాయి. 2018లో బీజేపీ అభ్యర్థుల్లో 37 శాతం మందిపై కేసులుంటే ఈసారి 43 శాతం మందిపై కేసులున్నాయి. జేడీఎస్‌లోనూ ఈ శాతం 21 నుంచి ఏకంగా 34 శాతానికి పెరగడం ఆందోళనకరం. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 2018 ఏడాదిలోనూ, ఇప్పడూ 55 శాతం మంది నేరచరితులున్నారు. ళీ 111 నియోజకవర్గాల్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు వివిధ రకాల క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.
కుబేరులూ ఉన్నారు..
► బీజేపీ నుంచి 216 మంది, కాంగ్రెస్ నుంచి 215 మంది, జేడీఎస్ నుంచి 170, ఆప్ నుంచి 197 మంది అభ్యర్థులు కోట్లకు పడగలెత్తారని వారి నామినేషన్ల పత్రాల ద్వారా తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థుల్లో 215 మంది కోటీశ్వరులు ఉండటం విశేషం. కోటీశ్వరులైన అభ్యర్థులను మొత్తంగా పరిశీలిస్తే ప్రతి అభ్యర్థి సరాసరి ఆస్తి విలువ రూ. 12 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment