
సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరులోని దట్టగళ్లిలోని తమ కన్వెన్షన్ హాల్ అక్రమంగా నిర్మించారని గత కలెక్టర్ రోహిణి సింధూరి చేసిన ఆరోపణలపై గురువారం కేఆర్ నగర జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే సా.రా మహేశ్ ఆందోళన చేపట్టారు. ప్రాంతీయ కమిషనర్ ఆఫీసు ఆవరణలో ఒంటరిగా కాసేపు బైఠాయించారు. తన ఆస్తి ఏదైనా గానీ అక్రమమని తేలితే వాటిని గవర్నర్ పేరిట రాసిస్తానని సవాలు విసిరారు. సక్రమమని తేలితే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాలన్నారు.
మరోవైపు జిల్లా చుట్టుపక్కల జరిగిన భూకుంభకోణాలపై దర్యాప్తునకు ఐఏఎస్ రోహిణి సింధూరిని నియమించాలని ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఈ భూకుంభకోణంపై ఆమెకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. అయితే, ఇద్దరు ఐఏఎస్ల మధ్య రగడ తారా స్థాయికి చేరడంతో సీఎం యడియురప్ప రోహిణి సింధూరిని, కమిషనర్ శిల్పానాగ్లను వేర్వేరు శాఖలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.