సాక్షి, బెంగళూరు: కోవిడ్ కష్టకాలంలో ప్రజలు ఉపాధి కరువై అల్లాడుతుండగా, చట్టసభ సభ్యుల వేతనాలు, భత్యాలు భారీగా పెరిగాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే మంత్రుల వేతన భత్యాలను, పెన్షన్లను బొమ్మై ప్రభుత్వం పెంచేసింది. మంగళవారం విధానసభలో ఈ మేరకు రెండు బిల్లులను ఆమోదించారు. ఇప్పుడున్న జీతాలతో పోలిస్తే 50 శాతం పెరగడం గమనార్హం.
దీనిని మంత్రి మాధుస్వామి సమర్థించుకొన్నారు. కోవిడ్ సమయంలో చాలా కష్టమైంది. డీజిల్, పెట్రోల్ ధరలు, ఇంటి బాడుగలు పెరిగాయి, అందువల్ల జీతభత్యాలను 50 శాతం పెంచాల్సి వచ్చిందని అన్నారు. 2015 తరువాత జీతభత్యాలను పెంచలేదని చెప్పారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 92 కోట్ల భారం పడుతుంది.
ఎవరికి ఎంత పెంపు
కొత్తగా సీఎం వేతనంలో రూ.50– 75 వేల వరకు పెరుగుతుంది. మంత్రుల జీతంలో రూ.40–60 వేల మధ్య పెరుగుతుంది. వారి వార్షిక అలవెన్స్‌లు రూ.లక్ష పెరిగి రూ.4.5 లక్షలకు చేరతాయి
►మంత్రుల నెలవారి ఇంటి అద్దె రూ.80 వేలు ఉండగా దానిని రూ.1.25 లక్షలకు పెంపు. ఇంటి ముందు తోట నిర్వహణ భత్యం రూ.30 వేలకు పెంపు. నెలకు వెయ్యి లీటర్లకు ఉన్న పెట్రోల్/ డీజిల్ వ్యయం ఇప్పుడు 2 వేల లీటర్లకు పెంపు
►మంత్రుల రోజువారి టూర్ అలవెన్స్ రూ.2,500కు పెంపు. సభాపతులు, ప్రతిపక్ష నేతలకూ ఇవే వర్తిస్తాయి
►ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయానికి వస్తే వారి వేతనంలో రూ.25– 40 వేల వరకూ వృద్ధి ఉంటుంది. నెలవారి నియోజకవర్గ భత్యం రూ. 60 వేలుగా నిర్ధారణ. మాజీలకు నెలకు రూ.50 వేల పెన్షన్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment