శ్రీనగర్: కరడుగట్టిన ఉగ్రవాది షాకీర్ అల్తాఫ్ భట్ ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడు 2018లో విద్యాభ్యాసం కోసం భారత పాస్‌పోర్టుపై పాకిస్తాన్‌కు వెళ్లి, ఉగ్రవాదిగా మారి జమ్మూకశ్మీర్‌కు తిరిగొచ్చినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇలాంటి కేసులు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. యువత అన్ని అధికారిక పత్రాలతో రాచమార్గంలో పాకిస్తాన్‌కు చేరుకొని, ఉగ్రవాద శిక్షణ పొంది, తిరిగొస్తుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం దేశ భద్రతకు సవాలు లాంటిదేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.
2015 నుంచి 2019 వరకూ జమ్మూకశ్మీర్‌లో జారీ చేసిన పాస్‌పోర్టులపై దర్యాప్తు సంస్థలు ఆరా తీశాయి. ఈ ఐదేళ్లలో పాసుపోర్టులో పొందినవారిలో 40 మంది యువత ఉన్నత విద్యాభ్యాసం పేరుతో బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్‌కు వెళ్లినట్లు వెల్లడయ్యింది. వీరిలో 28 మంది ఆయా దేశాల్లో ఉగ్రవాద శిక్షణలో రాటుదేలి, భారత్‌లోకి అక్రమంగా చొరబడినట్లు తేటతెల్లమయ్యిందని అధికార వర్గాలు శనివారం పేర్కొన్నాయి. మూడేళ్లలో మరో 100 మందికిపైగా కశ్మీరీ యువత వీసాపై పాకిస్తాన్‌కు వెళ్లారు. వీరిలో చాలామంది తిరిగిరాలేదు. తిరిగిగొచ్చిన కొందరు కనిపించకుండా పోయారు. వీరంతా స్లీపర్ సెల్స్‌గా మారి ఉంటారని అనుమానిస్తున్నారు.
కొత్తగా చేరినవారికి ఆరు వారాల శిక్షణ
గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ దాకా దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్, కుల్గాం, అనంతనాగ్ జిల్లాకు చెందిన కొందరు యువకులు సరైన ధ్రువపత్రాలతో పాకిస్తాన్‌కు వెళ్లారనీ, వారు ఇప్పటికీ అధికారికంగా తిరిగి రాలేదని అధికారులు చెప్పారు. నిజానికి వారంతా అక్రమంగా భారత్‌లోకి చొరబడి ఉంటారని వెల్లడించారు. గత మూడేళ్లలో పాకిస్తాన్‌కు వెళ్లి, అక్కడ వారం రోజులకుపైగా ఉండి, తిరిగి వచ్చిన యువకులను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.
రాళ్లు విసిరేవారికి పాస్‌పోర్టు రాదు.. సర్కారీ కొలువు దక్కదు
జమ్మూకశ్మీర్‌లో భద్రతా సిబ్బందిపై రాళ్లు విసిరేవారిపై, విధ్వంసకర కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇలాంటి వారికి ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు రావు, కనీసం పాస్‌పోర్టు కూడా పొందలేరు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పోలీసు శాఖ సీఐడీ విభాగం శనివారం ఉత్తర్వు జారీ చేసింది. పాసుపోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వరు. రాళ్లు విసిరేవారు ప్రభుత్వ పథకాల్లోనూ లబ్ధి పొందలేరు. పోలీసుల వద్ద, భద్రతా సిబ్బంది వద్ద, దర్యాప్తు సంస్థల వద్ద ఉన్న సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీ, ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్‌లను నిశితంగా పరిశీలిస్తామని.. పాస్‌పోర్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అందులో ఉన్నట్లు తేలితే వాటిని నిరాకరిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment