న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన సంజయ్ సింగ్‌తో పాటు మరో ఏడుగురు ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడంపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించారు. వ్యవసాయ బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో ఆందోళనకు దిగిన ఎంపీలను సస్పెండ్ చెయ్యడాన్ని వారు తప్పుబట్టారు. ఎంపీలు పోరాడింది తమ ప్రయోజనాల కోసం కాదని, ప్రజాస్వామ్యం కోసం, వ్యవస్థ కోసం, దేశంలోని రైతుల కోసమని అన్నారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలను ఓటింగ్ లేకుండా ఎలా ఆమోదిస్తారని దేశంలోని రైతులు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. బిల్లులను ఏకపక్షంగా ఆమోదిస్తే ఇక పార్లమెంటు సమావేశాలు ఎందుకుని ప్రశ్నించారు. చదవండి : కేజ్రీవాల్‌కు పంజాబ్ సీఎం వార్నింగ్!
కేంద్ర ప్రభుత్వం బ్రిటీషు పాలనను తలపిస్తోందని సిసోడియా ఆరోపించారు. బ్రిటిషర్ల మాదిరిగా సాధారణ రైతులు, వ్యాపారులు, కార్మికులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఎనిమిది మంది ఎంపీలను వారం రోజులపాటు సస్పెండ్ చేస్తూ సోమవారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వీరిలో టీఎంసీకి చెందిన డెరెక్ ఓబ్రియన్, డోలాసేన్, ఆప్‌కు చెందిన సంజయ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ సతావ్, రిపున్ బోరా, సయ్యద్ నసీర్ హుస్సేన్‌తో సీపీఎంకు చెందిన కేకే రాగేష్, ఎలమారమ్ కరీం ఉన్నారు. కాగా, విపక్ష సభ్యుల ఆందోళన మధ్య రాజ్యసభలో ఆదివారం మూజువాణి ఓటుతో రెండు వ్యవసాయ బిల్లులూ ఆమోదం పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment