చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ నేత సంజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి హర్యానాలో బీజేపీ అధికారం నుండి దిగిపోతుందని, ఆమ్ ఆద్మీ పార్టీ సాయం లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదన్నారు. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కింగ్ మేకర్ అవుతారని, అధికార రిమోట్ కేజ్రీవాల్ చేతుల్లో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో ఎందుకు రాజీనామా చేయలేదో కూడా సంజయ్ సింగ్ వివరించారు.
ఒక మీడియా సంస్థ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ తాము సీట్ల విషయంలో కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకోలేదని, వారు, తాము విడివిడిగానే పోటీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వారి ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించుకోవాల్సి ఉందని, అయితే రిమోట్ కేజ్రీవాల్ చేతిలో ఉంటుందనే నమ్మకం తనలో ఉందన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 90 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.
గత పదేళ్ల పాలనలో సీఎం ఖట్టర్ హర్యానాను పూర్తిగా దిగజార్చారని, ఇప్పుడు నిరుద్యోగం విషయంలో భారతదేశంలో హర్యానా మొదటి స్థానంలో ఉందన్నారు. అగ్నివీర్ పథకంపై గ్రామాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, ప్రభుత్వ పనితీరుపై రైతులు మండిపడుతున్నారన్నారు.
జైల్లో ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని సంజయ్ సింగ్‌ను మీడియా ప్రశ్నించగా అదేగనుక జరిగివుంటే, బీజేపీ వ్యూహం ఫలించేదని.. ఆ తర్వాత మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి, పి. విజయన్.. ఇలా అందరినీ జైల్లో పెట్టి, బీజేపీ వారి రాజీనామాలను తీసుకుని ఉండేదని అన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ రాజీనామా చేసి, అతిశీని ముఖ్యమంత్రిని చేశారని, ఢిల్లీ ప్రజలు నాలుగు నెలల తర్వాత మళ్లీ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నికుంటారని సంజయ్ సింగ్ దీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం ఇంట్లో భారీ చోరీ
Comments
Please login to add a commentAdd a comment