జేబులో 170 రూపాయలు, చేతిలో ఆర్డినరీ సైకిల్, ఆ సైకిల్ క్యారియర్‌కి టీ తయారు చేసే సరంజామా. అతడు బయలుదేరింది ఆ పట్టణంలో ఏదో ఓ సెంటర్‌లో టీ అమ్ముకోవడానికి కాదు. టీ అమ్ముకుంటూ జమ్ము– కశ్మీర్ చేరడానికి. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వందరోజుల్లో కశ్మీర్ చేరాలనే సంకల్పం అతడిది.
దారి ఖర్చులకు టీ
కేరళలో పుట్టిన నిధిన్‌కి పర్యటనలంటే చాలా ఇష్టం. ఈ ఏడాది కశ్మీర్ చూడాలనుకున్నాడు. అతడిలో పర్యటించాలనే కోరిక అయితే బలంగా ఉంది. కానీ విమానంలో కాదు కదా, రైల్లో వెళ్లి రావడానికి కూడా తగినంత డబ్బు లేదు. తనకు టీ చక్కగా చేయడం వచ్చు. దారి ఖర్చులు కూడా దారిలోనే సంపాదించుకోవచ్చనుకున్నాడు. సైకిల్‌కి టీ కెటిల్ తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టాడు.
ఐదు రాష్ట్రాలు
నిదిన్ వయసు 23. అతడి ప్రయాణ దూరం 3,300 కిలోమీటర్లు. అతడు తనకు తాను నిర్దేశించుకున్న లక్ష్యం వంద రోజులు. జనవరి ఒకటవ తేదీన సొంతూరు త్రిశూర్‌లో గూగుల్ మ్యాప్ సహాయంతో మొదలైన ప్రయాణం కర్నాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల మీదుగా నెలాఖరుకు రాజస్థాన్ చేరింది. త్రిశూర్ నుంచి బయలుదేరేటప్పుడు అతడి జేబులో ఉన్న 170 రూపాయలు పాలు కొనడానికి పెట్టుబడి అన్నమాట. పాలు దొరికే చోటును రాత్రి బసకు ఎంచుకునే వాడు. దగ్గరగా ఉన్న పెట్రోల్ బంకులో గుడారం వేసుకుని నిద్రపోతాడు. అతడి దినచర్య రోజూ ఉదయం ఐదున్నరకు మొదలవుతుంది. టీ తయారు చేసి అక్కడ అమ్మగా మిగిలిన టీని ఫ్లాస్కులో పోసుకుని బయలుదేరేవాడు.
అలా అతడి రోజు రాబడి మూడు వందల యాభై రూపాయలు. నిదిన్ సంకల్పం తెలిసిన వాళ్లు అతడి టీ కొనడమే కాక విరాళంగా తోచినంత డబ్బు సహాయం చేసేవారు. ఈ ప్రయాణంలో తాను ఎంతో నేర్చుకున్నానని చెబుతున్నాడు నిదిన్. ‘చేతిలో డబ్బు ఉండి రైల్లోనో, విమానంలోనో వెళ్లి ఉంటే ప్రదేశాలను మాత్రమే చూడగలిగేవాడిని. ఇప్పుడు సమాజాన్ని చూడగలిగాను. సాటి మనిషికి చేయగలిగినంత సహాయం చేసే మనుషులు మన మధ్య ఇంకా ఉన్నారు. నేను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నాకు మంచి హెల్మెట్, గ్లవ్స్ లేవు. ఇప్పుడు వాటిని కొనుక్కోగలిగానంటే... ఎంతో మంది సామాన్యులు నా మీద చూపించిన ఆదరణే. ఇదే స్ఫూర్తితో నా గడువు లోపే కశ్మీర్ చేరుతాను’ అన్నాడతడు.
Comments
Please login to add a commentAdd a comment