దేశానికి రాజైనా తల్లికి కొడుకే చట్టానికి, సమాజానికి క్రూరుడైనా తల్లికి బిడ్డే అని ఆమె మాటలు వింటే అర్ధమవుతుంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య, ఈ నేరానికి సంబంధించి సివిల్ వాలంటీర్‌ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రూరమైన సంఘటన దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది, భారతదేశం అంతటా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ నేపధ్యంలో ఈ హత్యాచారానికి పాల్పడ మృగాడి తల్లి మాత్రం తన బిడ్డ ఎంతో మంచివాడని చెబుతోంది. అంతేకాదు ఘటన జరిగినప్పటి నుంచి తన కుమారుడిని చూడలేదని నిందితుడి తల్లి చెప్పింది.
సమాజం వెలివేసింది...
‘‘నా కుమార్తెలు ఎవరూ ఇంటికి రాలేదు. పరిచయస్తులు నలుగురూ నన్ను విడిచిపెట్టారు’’అని సంజయ్ రాయ్ తల్లి తాజాగా ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘‘నా కొడుకును కలవడానికి నన్ను ఎవరూ తీసుకెళ్లలేదు. నా కోడలు, నా కూతుళ్లు ఇప్పుడు ఎవరూ రావడం లేదు. కోర్టులో ఎలా అప్పీల్ చేయాలో నాకు తెలియదు ’’అని ఆమె చెప్పింది. తనకు అన్నం వండిపెట్టడంతో సహా రాయ్ తనని చక్కగా చూసుకునేవాడంది. ‘‘నాకు చాలా అందమైన కొడుకు, అందమైన కుటుంబం ఉండేది. నా భర్త మరణంతో, ప్రతిదీ మారిపోయింది, నా అందమైన కుటుంబం ఇప్పుడు ఓ జ్ఞాపకం మాత్రమే’’ అంటూ ఆవేదనగా చెప్పింది.
సంజయ్ రాయ్ కళాశాల గ్రాడ్యుయేట్ అని ఎన్‌సిసి కార్ప్‌లో కూడా భాగమని అతని తల్లి వెల్లడించింది. ‘‘సంజయ్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. అతని తండ్రి చాలా కఠినంగా క్రమశిక్షణతో ఉండేవాడు. బహుశా నేను ఇంకా కఠినంగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు’’ అని తల్లి చెప్పింది.
భార్య చనిపోవడంతోనే దారి తప్పాడు...
సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు నిందితుడు తాగిన మత్తులో తరచూ అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చేవాడని ఇరుగుపొరుగు వారు తెలిపారు. అతని ‘దుష్ప్రవర్తన‘ కారణంగా అతని మునుపటి ముగ్గురు భార్యలు అతనిని విడిచిపెట్టారని వారు చెబుతున్న విషయాలని అతని తల్లి ఖండించింది. తన కొడుకు ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పింది. ‘‘సంజయ్ మొదటి భార్య మంచి అమ్మాయి. వారిరువురూ సంతోషంగా ఉండేవారు. అకస్మాత్తుగా, ఆమెకి క్యాన్సర్ వచ్చింది. దాంతో వారి ఆనందం తాత్కాలికంగా మారింది’’ అని ఆమె గుర్తుచేసుకుంది.
ఇష్టమైన భార్య దూరం కావడంతో రాయ్ డిప్రెషన్‌లోకి వెళ్లాడని మద్యం తాగడం ప్రారంభించాడని అయితే ఆ అలవాటును తాను అంగీకరించలేదని ఆమె పేర్కొంది. ‘‘ఒకరోజు బాగా మందు తాగి వచ్చాడు.. బాధపడకు, మనం వేరొకరిని చూద్దాం’ అని తాను ఓదార్చానని... భార్య దూరమైతే విచారం కలగడం సహజం. కానీ మద్యం తాగవద్దని, టీ తాగమని చెప్పానని వివరించింది. అతను మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి మాట వినేవాడు, ’’అంటూ ఆమె గుర్తు చేసుకుంది.
ఆ రాత్రి తిండి తినకుండా వెళ్లాడు...
హాస్పిటల్‌లో రాయ్ కార్యకలాపాల గురించి తనకు తెలియదని అతను తన అనుమానాలను పెంచేలా అసాధారణంగా ఎప్పుడూ ప్రవర్తించింది లేదని ఆమె నొక్కి చెప్పింది. అతను ఎప్పుడూ అనుమానం వచ్చేలా ఏమీ చేయలేదు, కాబట్టి తాను అప్రమత్తంగా లేనని తెలిపింది. ‘ ఘటన జరిగిన రోజు రాత్రి అతను డిన్నర్ చేయలేదు, ’నేను ఆసుపత్రికి వెళ్తున్నాను’ అని మాత్రం నాకు చెప్పాడు,‘ అన్నదామె.
తన కొడుకు ప్రమాదకరం కాదని చెప్పింది. ‘‘ఎవరైనా అతనిని ఇరికించినట్లయితే, ఆ వ్యక్తి శిక్షించబడతాడు. లేక నా కొడుకే నేరం చేసి ఉంటే, దేవుడు అతన్ని శిక్షిస్తాడు’’ అంటూ స్పష్టం చేసింది. కొడుకుని కలిసే అవకాశం వస్తే.. ‘నేను అతనిని కలిస్తే ’బాబూ, ఎందుకు ఇలాంటి పని చేసావు?‘ అని అడుగుతానంటూ ఆమె చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment