మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్ పి శివ శంకర్ భార్య లక్ష్మీ బాయి(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో భారంతో బాధపడుతున్న ఆమె.. ఈరోజు(గురువారం) తుది శ్వాస విడిచారు. ప్రముఖ వయోలినిస్ట్ ద్వారం వెంకటస్వామి నాయుడికి ఈమె మేనకోడలు.
విశాఖపట్నం జిల్లా యలమంచలి ఈమె తండ్రి స్వస్థలం కాగా, అటు తర్వాత ఒడిశాలో సెటిల్ అయ్యారు. ఒడిశా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి మహిళగా లక్ష్మీ బాయి ఘనత సాధించారు. ఉత్కల్ యూనివర్శిటీ నుంచి బీఏ డిగ్రీ పూర్తి చేసిన లక్ష్మీబాయి.. ఆపై బెనారస్ యూనివర్శిటీ నుంచి పోస్టల్ కోర్సు ద్వారా ఎంఏ కూడా పూర్తి చేశారు.
భర్త సాధించిన విజయాల్లో ఆమె కృషి వెలకట్టలేనిది. భర్త పి శివ శంకర్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, సిక్కిం గవర్నర్‌గా వ్యవహరించినప్పుడు ఆయనకు విశేష తోడ్పాటును అందించారు. దాంతో పెర్‌ఫెక్ట్ హోస్ట్ గుర్తింపును సైతం సొంతం చేసుకున్నారు.
80 ఏళ్ల వయసులో..
80 నుంచి 90 ఏళ్ల మధ్యలో ఆమె రెండు పీహెచ్‌డీలు, ఒక డీ లిట్ సాధించారు! ఆమె 87 సంవత్సరాల వయస్సులో ఆమె చేసిన పిహెచ్‌డిలలో ఒకటి ఆమెకు బంగారు పతకాన్ని మాత్రమే కాకుండా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని సాధించడంలో ఉపయోగపడింది.
రెండు పిహెచ్‌డిలలో మొదటిది ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన థీసిస్ 'భగవద్గీత.. ఆధునిక కాలపు మనిషికి దాని ఔచిత్యం'పై 5000 పేజీల ప్రవచనం, ఇది ఆమె 80 సంవత్సరాల వయస్సులో పూర్తిగా చేతితో వ్రాయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment