ఎన్నికల బరిలో కనిపించని మహిళలు
రెండు లోక్‌సభ స్థానాలకు ఒక్కరు, 50 అసెంబ్లీ స్థానాలకు 8 మంది
ఈటానగర్: చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో అరుణాచల్ ప్రదేశ్ అందుకు మినహాయింపేమీ కాదు. రెండు లోక్‌సభ స్థానాలతో పాటు రాష్ట్రంలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగననున్నాయి. కానీ ఈ ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగిన మహిళల సంఖ్య మాత్రం అంతంతే...
ఇప్పటివరకు 15 మంది...
అరుణాచల్ ఈస్ట్, అరుణాచల్ వెస్ట్ రెండు లోక్‌సభ స్థానాలకు మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. గణ సురక్ష పారీ్టకి ప్రాతినిధ్యం వహిస్తున్న టోకో శీతల్ ఒక్కరే మహిళ. 50 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది మంది మహిళలు మాత్రమే నామినేషన్లు వేశారు. వారిలో అధికార బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు కాగా ఒకరు ఇండిపెండెంట్. వీరిలో హయులియాంగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దా సంగ్లు పుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
1987లో అరుణాచల్ ప్రదేశ్ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి కేవలం 15 మంది మహిళలు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి ఒక మహిళ మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారు. సిబో కైను 1978లో అసెంబ్లీకి గవర్నర్ నామినేట్ చేశారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) అభ్యర్థిగా సెప్పా నియోజకవర్గం నుంచి 1980లో అసెంబ్లీకి ఎన్నికైన మొదటి మహిళ న్యారీ వెల్లి. కోమోలి మొసాంగ్ 1980లో నాంపాంగ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా ఎన్నికయ్యారు. 1990లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి ఆమె విజయం సాధించారు. ఒమేమ్ మోయోంగ్ డియోరీ 1984లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1990లో కాంగ్రెస్ టిక్కెట్‌పై లేకాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా గెలుపొందారు.
బలమైన గొంతుకలు కావాలి..
సాంస్కృతిక అడ్డంకులు, సామాజిక–ఆర్థిక పరిమితులు, అవగాహన లేమి వంటి అనేక అంశాలు ఎన్నికల రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయ ప్రక్రియలో మహిళల ప్రమేయాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం, పౌర సమాజ సంస్థల సమష్టి కృషి అవసరమని అరుణాచల్ ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కెంజుమ్ పాకం అన్నారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లపై చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాని బాత్ సూచించారు. అప్పుడే అరుణాచల్ వంటి చోట్ల వారికి ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment