టౌమ్స్ నౌ సర్వే వెల్లడి
ఎన్డీయే కూటమికి 378 సీట్లు
ఇండియా కూటమికి 120, ఇతరులకు 45 స్థానాలు
కాంగ్రెస్‌కు 28 నుంచి 48 సీట్లకు మించకపోవచ్చు
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీ ఘనవిజయం ఖాయమని టైమ్స్ నౌ చానల్–ఈటీజీ సర్వే శుక్రవారం పేర్కొంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను ఆ పార్టీ ఒంటరిగా ఏకంగా 333 నుంచి 363 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 378 స్థానాలదాకా సాధించవచ్చని వివరించింది. విపక్ష ఇండియా కూటమికి కేవలం 120, ఇతరులకు 45 స్థానాలు రావచ్చని పేర్కొంది.
ఇండియా కూటమిలోని ప్రధాన పక్షమైన కాంగ్రెస్‌కు 28 నుంచి గరిష్టంగా 48 సీట్లొస్తాయని వివరించింది. తమిళనాట డీఎంకేకు 24 నుంచి 28 సీట్లు, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 10 నుంచి 11 సీట్లు వస్తాయని వెల్లడించింది. 42 లోక్‌సభ స్థానాలున్న పశి్చమబెంగాల్‌లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 17 నుంచి 21 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. అక్కడ బీజేపీకి 20 నుంచి 24 సీట్లు రావచ్చని పేర్కొంది. ఏడు సీట్లున్న ఢిల్లీలో ఆప్ 5 నుంచి మొత్తం 7 స్థానాలూ కొల్లగొట్టవచ్చని సర్వే వెల్లడించడం విశేషం.
యూపీలో బీజేపీ క్లీన్‌స్వీప్
అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ ఖాయమని సర్వే పేర్కొంది. రాష్ట్రంలో 80 స్థానాలకు ఎన్డీఏ కూటమికి 72 నుంచి 78 వస్తాయని, కాంగ్రెస్, సమాజ్‌వాదీలతో కూడిన ‘ఇండియా’ కూటమి 2 నుంచి 6 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. ఇక బీఎస్పీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని అభిప్రాయపడింది. గుజరాత్‌లోనైతే మొత్తం 26 సీట్లనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని పేర్కొంది.
బిహార్‌లో 42 సీట్లకు గాను బీజేపీ, జేడీ(యూ)తో కూడిన ఎన్డీఏ కూటమికి 31 నుంచి ఏకంగా 36 స్థానాలు రావచ్చని సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్, ఆర్జేడీ తదితరులతో కూడిన ఇండియా కూటమి 2 నుంచి 4 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. ఇక 48 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లతో కూడిన ఎన్డీఏ కూటమికి 34 నుంచి 38, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్)లతో కూడిన ఇండియా కూటమికి 9 నుంచి 13 స్థానాలు రావచ్చని వివరించింది. కర్ణాటకలో ఎన్డీఏకు 22 నుంచి 24, కాంగ్రెస్‌కు కేవలం 4 నుంచి 6 సీట్లు రావచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment