ఈసారి కూడా గెలుపు మా కూటమిదే: మోదీ
మూడో టర్మ్‌లో చేయాల్సిన పని చాలా ఉందన్న ప్రధాని
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) లోక్‌సభ ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈసారి కూడా తమ కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పలు పోస్టులు చేశారు.
‘మరోసారి మోదీ సర్కారు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. గత పదేళ్ల తమ పాలనలో భారత్ ఎంతగానో అభివృద్ధి చెందిందని, వైభవోజ్వల మార్పును చూసిందని ఉద్ఘాటించారు. 140 కోట్ల మంది భారతీయుల శక్తియుక్తులతో అభివృద్ధిలో దేశం కొత్త రికార్డులు సృష్టించిందని హర్షం వ్యక్తంచేశారు. ప్రజలకు సుపరిపాలన అందించామని పేర్కొన్నారు. ఈ ట్రాక్ రికార్డును ఆధారంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలను అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకగా అభివరి్ణంచారు.
ప్రధానమంత్రిగా వరుసగా మూడో పర్యాయం బాధ్యతలు చేపడతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి పేదరికం, అవినీతిపై యుద్ధం వేగవంతం చేస్తానని తేలి్చచెప్పారు. సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేయడం తన ధ్యేయమని పేర్కొన్నారు. మూడో టర్మ్‌లో చేయాల్సిన పని చాలా ఉందని వెల్లడించారు. దేశ ప్రగతి కోసం రాబోయే వెయ్యి సంవత్సరాలకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను వచ్చే ఐదేళ్లలో తయారు చేసుకోవాలని చెప్పారు.
ప్రజల ఆశీస్సుల నుంచే నాకు కొత్త శక్తి
దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత 70 ఏళ్లు పాలించిన ప్రభుత్వాలు సృష్టించిన ఖాళీలను గత పదేళ్ల భర్తీ చేశామని ప్రధాని మోదీ తెలియజేశారు. దేశం సౌభాగ్యవంతంగా మారుతుందని, స్వావలంబన సాధిస్తుందన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో పెంచామని వివరించారు. ‘వికసిత్ భారత్’ అనే లక్ష్య సాధనకు మనమంతా కలిసికట్టుగా పని చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
మన దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుకోవడానికి, మన యువత కలలను సాకారం చేయడానికి మరింత పట్టుదలతో కృషి చేద్దామని సూచించారు. ప్రతిపక్షాల పరిస్థితి చుక్కాని లేని నావలా మారిందని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు వెళ్లడానికి విపక్షాలకు ఒక బలమైన అంశమే లేదన్నారు. ప్రజల కోసం కష్టపడుతున్న తమను దూషించడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తప్ప విపక్షాలకు ఇంకేమీ తెలియదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment