న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉండాలని సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. టీకాల బూస్టర్ డోసుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో వెల్లడించాలని ప్రశ్నించారు. ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 40 దాటాయని, పలు రాష్ట్రాల్లో దీని ఛాయలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ హెచ్చరించింది. ఒమిక్రాన్‌ను ఎమర్జెన్సీగా బ్రిటన్ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని టీఎంసీ గుర్తు చేసింది. దీని కట్టడికి ప్రభుత్వం తీసుకునే చర్యలేంటని పలువురు సభ్యులు ప్రశ్నించారు.
మరోవైపు ప్రభుత్వం తీసుకునే హ్రస్వదృష్టి విధాన నిర్ణయాలతో ఆర్థిక పునరుజ్జీవనం అనిశ్చితిలో పడిందని కాంగ్రెస్ నేత శశి థరూర్ విమర్శించారు. దేశంలో ప్రస్తుత సంక్షోభానికి పెద్దనోట్ల రద్దుతో పునాదులు పడ్డాయన్నారు. మంగళవారం పార్లమెంటు రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పెంచే వీలునిచ్చే బిల్లులను రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. వీటికి ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో ఇవి త్వరలో చట్ట రూపం దాల్చనున్నాయి.
సభలో మీ ఆఫీసులు నడపొద్దు
కేంద్ర మంత్రులు పార్లమెంట్‌లో సభ్యులతో తరచూ సమావేశం కావడంపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు తమ కార్యాలయాలను పార్లమెంట్ నుంచి నడిపించొద్దని కోరారు. సభ జరిగే సమయంలో పలువురు సభ్యులు కేంద్ర మంత్రుల వద్దకు వచ్చి మాట్లాడూతుండడం ఇటీవల సర్వసాధారణమైంది. మంగళవారం కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సీటు వద్దకు ఒక సభ్యుడు వచ్చి చర్చలు జరపడాన్ని గమనించిన స్పీకర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభ్యులు ఆయా అంశాలపై వ్యక్తిగతంగా చర్చించాలనుకుంటే తమ ఆఫీసుల్లో కలుసుకోవాలని గౌరవనీయులైన మంత్రులు సూచించాలన్నారు. సభ్యులు సభా గౌరవాన్ని కాపాడాలన్నారు. ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిందన్న తర్వాత కూడా సమాధానం కొనసాగించడంపై మరో మంత్రి కైలాస్ చౌధరిపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment