బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత్ సరైన పనే చేసిందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఆమె విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. పొరుగుదేశమైన బంగ్లాలో అధికార మార్పు భారత్‌ను ఆందోళనకు గురిచేసే అంశం కాదన్నారు.
కాగా బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్ హసీనా గత వారం తన పదవికి రాజీనామా చేసి.. ఉన్పళంగా దేశం వీడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని తాజా పరిణామాలు, బంగ్లాలో మద్యంతర ప్రభుత్వ ఏర్పాటుతో భార్‌త్‌తో సంబంధాలపై ప్రభావం, భారత్‌లో షేక్ హసీనా ఆశ్రయం వంటి అంశాలపై శశిథరూర్ స్పందించారు.
బంగ్లాదేశ్‌తో భారత్‌కు సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం నిబద్దతతో ఉన్నట్లు పేర్కొన్నారు. ‘మనం ఎలప్పుడూ బంగ్లాదేశ్ ప్రజలతో ఉన్నాం. అక్కడి ప్రజలకు అండగా ఉన్నాం. 971 యుద్ధం సమయంలో వారితోనే ఉన్నాం.. వారి కష్టసుఖాల్లోనూ వెంటే ఉన్నాం. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా భారత్‌తో స్నేహపూర్వకంగానే ఉన్నారు.. రాబోయే కాలంలోనూ ఇరు దేశాల బంధాల్లో ఎలాంటి మార్పు ఉండదు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంతో భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన నాకు వ్యక్తిగతంగా తెలుసు. చాలా గౌరవనీయమైన వ్యక్తి
హసీనాకు మనం సాయం చేయకపోతే.. అది భారత్‌కు అవమానం. మన స్నేహితుడితో మనం చెడుగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎవరూ మనకు మిత్రులుగా ఉండేందుకు ఇష్టపడరు. హసీనా భారత్‌కు స్నేహితురాలు. ఆమెకు కూడా భారత్ స్నేహితురాలే. మీ మిత్రులు సమస్యల్లో ఉంటే ఎప్పుడూ సాయం చేయడానికి వెనుకాడకూడదు. కచ్చితంగా వారిని సురక్షితంగా ఉంచేలా చూడాలి.
ఇప్పుడు భారత్ కూడా చేసింది అదే. ఒక భారతీయుడిగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. అంతకు మించి నేనేమీ కోరుకోవడం లేదు. ఒక భారతీయుడిగా మనం ప్రపంచం కోసం నిలబడే విషయంలో కొన్ని ప్రమాణాలున్నాయి. ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి రక్షణ కల్పించి ప్రభుత్వం సరైన పనే చేసింది’. అని థరూర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment