ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. దేశవిదేశాల నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఈరోజు(బుధవారం) మహాకుంభమేళాలో మూడవ రోజు. అత్యంత భారీస్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు వివిధ ఘాట్‌ల వద్ద భక్తులు ఉదయం నుంచే క్యూలు కడుతున్నారు. మహా కుంభమేళా(Great Kumbh Mela) ప్రారంభమైనది మొదలుకొని ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు గంగా మాత హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో సంగమతీరం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది.
మంగళవారం మకర సంక్రాంతి(Makar Sankranti) సందర్భంగా సాధువులతో పాటు భక్తులు తొలి అమృత స్నానం చేశారు. 13 అఖాడాలకు చెందిన సాధువులు ఒకరి తర్వాత ఒకరుగా స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు సుమారు 3.50 కోట్ల మంది భక్తులు గంగా సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం మొదటి స్నానోత్సవం నాడు 1.65 కోట్ల మంది భక్తులు స్నానం చేశారు. ఈ విధంగా రెండు రోజుల్లో మొత్తం 5.15 కోట్ల మంది సంగమంలో స్నానం చేశారు.
ఈసారి జరుగుతున్న మహా కుంభమేళా ఎంతో ప్రత్యేకమైనది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభమేళా ఇది. సంగమ తీరంలోని 4,000 హెక్టార్ల ప్రాంతంలో ఈ ఉత్సవం జరుగుతోంది. మహా కుంభమేళాలో స్నానం చేసిన భక్తులు తాము సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కుంభమేళా తొలిరోజున సంగమతీరంలో స్నానాలాచరిస్తున్న వారిపై హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు
Comments
Please login to add a commentAdd a comment