ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమానికి చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే ప్రతీభక్తుడు పుణ్య స్నానానికి ఎంత సమయం కేటాయిస్తున్నాడు? తాజాగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.
భక్తుల సంఖ్యను తెలుసుకునేందుకు..
త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తున్న ప్రతి భక్తుడు స్నాన ఘాట్‌లో సగటున 45 నిమిషాలు గడుపుతున్నాడని వెల్లడయ్యింది. రేడియో ఫ్రీక్వెన్సీ రిస్ట్ బ్యాండ్ల ద్వారా సేకరించిన డేటా ఈ వివరాలను తెలియజేసింది. ఇదేవిధంగా ఆర్‌ఎఫ్ రిస్ట్ బ్యాండ్ నుండి సేకరించిన డేటాను మేళాకు హాజరయ్యే భక్తుల సంఖ్యను లెక్కించేందుకు కూడా సంబంధిత అధికారులు ఉపయోగిస్తున్నారు.
మహా కుంభమేళాకు వచ్చే భక్తుల వాస్తవ సంఖ్యను తెలుసుకునేందుకు అధికారులు ప్రత్యేక పద్దతిని ఉపయోగిస్తున్నారు. అదే ఆర్‌ఎఫ్ రిస్ట్ బ్యాండ్. దీనిని యాత్రికుల మణికట్టుకు కట్టారు. ఈ ఆర్‌ఎఫ్ రిస్ట్ బ్యాండ్‌ల నుండి సేకరించిన డేటా ప్రకారం, మకర సంక్రాంతి, పుష్య పూర్ణిమ రోజుల్లో భక్తులు స్నాన ఘాట్‌ల వద్ద సగటున 45 నిమిషాలు గడిపారని వెల్లడయ్యింది. ఘాట్ చేరుకోవడం నుండి స్నానం చేసి, తిరిగి వచ్చే వరకు 45 నిముషాలు పట్టిందని తేలింది.
ఐదు లక్షల మంది ఉచిత ప్రయాణాలు
ఘాట్ వద్ద భక్తులు సగటున ఎంత సమయం గడుపుతారో తెలుసుకోవడం ద్వారా రద్దీని నియంత్రించగలుగుతామని పోలీసు అధికారులు తెలిపారు. ఆర్‌ఎఫ్ రిస్ట్ బ్యాండ్ డేటా అనాలిసిస్ టెక్నాలజీ నుండి పొందిన ఫలితాలు జనసమూహ నిర్వహణకు సహాయపడతాయని ఎస్‌ఎస్‌పీ రాజేష్ కుమార్ ద్వివేది తెలిపారు. కాగా పుష్య పూర్ణిమ, మకర సంక్రాంతి పండుగల సందర్భంగా జనం మధ్య చోటుచేసుకున్న తోపులాటలో 200 మందికి పైగా జనం గాయపడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నామని స్థానిక ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి చెందిన సర్జన్ డాక్టర్ వినయ్ యాదవ్ తెలిపారు. గడచిన నాలుగు రోజుల్లో దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణికులు షటిల్ బస్సులలో ఉచితంగా ప్రయాణించారు. గురువారం నుండి ప్రయాణికులు సాధారణ రోజుల మాదిరిగానే ఈ బస్సులలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.
93 ఏళ్ల తర్వాత..
1932లో ప్రయాగ్‌రాజ్ నుండి లండన్‌కు ఒక విమానాన్ని నడిపారు. ఇప్పుడు 93 ఏళ్ల తర్వాత బుధవారం ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానం బయలుదేరింది. ఈ విమానం అమెరికన్ బిలియనీర్ మహిళా వ్యవస్థాపకురాలు లారెన్ పావెల్ జాబ్స్ కోసం ఇక్కడికి వచ్చింది. ఈ విమానం భూటాన్‌కు వెళ్లింది. జాబ్స్ కొద్ది రోజుల పాటు భూటాన్‌లో ఉంటారని సమాచారం. బ్రిటిష్ పాలనలో ప్రయాగ్‌రాజ్ నుండి అంతర్జాతీయ విమానాలు నడిచేవి. 1932 వరకు ఇక్కడి నుండి లండన్ కు నేరుగా విమానం ఉండేది.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: నేడు అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పవిత్ర స్నానాలు
Comments
Please login to add a commentAdd a comment