పుష్కర ఒడిలో.. గోదారమ్మ గుడిలో..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆ అమ్మ నడయాడే నేలంతా సిరుల ధామం.. అణువణు వునా వేదనాదం.. సాహితీ సారస్వత సుమాల హారం.. ఆ తల్లి గుడికెళ్లి గుప్పెడు పసుపు.. కుంకుమతో అర్చిం చేందుకు తరుణీ మణులంతా తహతహలాడారు. దివంగతులైన పెద్దలకు పుణ్యగతులు సంప్రాప్తింప చేసేందుకు మగ మహారాజులంతా జలదేవత చెంతన పిండ ప్రదానాలు చేసి తర్పణలిచ్చారు. జనమంతా గోదారమ్మ గుడిలో తీర్థ విధులు నిర్వర్తించి తరించారు. అంత్య పుష్కరాల వేళ పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కొవ్వూరు, నరసాపురం పట్టణాలు పుష్కర యాత్రికులతో కిటకిటలాడాయి.
గోదావరి అంత్య పుష్కరాలకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. రెండో రోజైన సోమవారం మాసశివరాత్రి కావడంతో జిల్లాలోని స్నానఘట్టాలన్నీ కిటకిటలాడాయి. సుమారు 80వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నరసాపురంలో 10,436 మంది, ఆచంటలో 3,210 మంది, యలమంచిలిలో 5,020 మంది స్నానాలు చేయగా, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని ఘాట్లలో 50,725 మంది స్నానాలు ఆచరించినట్టు అధికారులు లెక్కగట్టారు. ఒక్క కొవ్వూరులోనే 25 వేల మంది స్నానాలు చేయగా, పెనుగొండలో 10,800 మంది, నిడదవోలులో 2,225 మంది, పెరవలి మండలంలో 12,200 మంది భక్తులు స్నానాలు ఆచరించినట్టు అధికారిక అంచనా. పోలవరం, పట్టిసీమ ఇతర ఘాట్లలో 4వేల మంది వరకూ పుణ్యస్నానాలు చేశారు. కొవ్వూరు, సిద్ధాంతం, నరసాపురంలలో భక్తుల రాకతో కోలాహలం నెలకొంది. తొలి రోజుతో పోలిస్తే రెండోరోజు భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం రాష్ట్ర బంద్ ఉండటంతో ఆ ప్రభావం పుష్కరాల స్నానాలపై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి రోజున నరసాపురంలో వలంధరరేవు ఘాట్కే భక్తులు పరిమితం కాగా, రెండో రోజున అమరేశ్వరఘాట్, కొండాలమ్మ ఘాట్ వద్ద కూడా స్నానాలు చేశారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం, నరసాపురం వలంధర రేవులో సోమవారం ఉదయం నుంచి 12 గంటల వరకూ రద్దీ కొనసాగింది. ఆ తరువాత జనం పలుచపడ్డారు. వలంధరరేవులో రెండో రోజున జల్లు స్నానం అందుబాటులోకి వచ్చింది. కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. మొదటిరోజు హడావుడి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు రెండో రోజున పత్తాలేకుండా పోయారు. ఘాట్లవద్ద నియమించిన అధికారులు, సిబ్బంది తప్పిస్తే.. మిగిలిన వారెవరూ పరిశీలనకు రాలేదు. రానున్న రోజుల్లో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.