
మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
భారీగా పుష్య పూర్ణిమ పుణ్యస్నానాలు
జనసంద్రంగా మారిన ప్రయాగ్‌రాజ్ సంగమస్థలి
పులకించిపోతున్న విదేశీ భక్తులు
నేడు వైభవంగా తొలి షాహీ స్నాన్
పీఠాధిపతులు, సాధువులతో వేడుక
2 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా సోమవారం అంగరంగ వైభవంగా మొదలైంది. భారీగా పోటెత్తిన భక్తులతో తొలి రోజే ప్రయాగ్‌రాజ్ జనసంద్రమైంది. ఏ వైపు చూసినా కనుచూపు మేరా కట్టలు తెగినట్టుగా జనప్రవాహమే. ఎముకలు కొరికే చలి. దట్టంగా కమ్ముకున్న పొగమంచు. అతి శీతల జలాలు. ఇవేవీ భక్తుల ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. తెల్లవారుజాము కల్లా త్రివేణి సంగమ స్థలి ఇసుక వేసినా రాలనంత జనంతో నిండిపోయింది.
శంఖనాదం, మంత్రోచ్చారణల నడుమ గంగా, యమున, సరస్వతి కలిసే చోట మేళా లాంఛనంగా ప్రారంభమైంది. ఆ వెంటనే ‘జై గంగా మాతా’, ‘హరహర మహాదేవ్’, ‘జై శ్రీరాం’ నినాదాలు మిన్నంటాయి. తర్వాత భక్తుల పుణ్యస్నానాలు మొదలయ్యాయి. తెల్లవారుజామున తొలి విడత స్నానాల్లో పాల్గొన్న వారిని యూపీ ప్రభుత్వం హెలికాఫ్టర్ ద్వారా పూలు చల్లి స్వాగతించింది.
సోమవారం సాయంత్రానికే ఏకంగా 1.65 కోట్ల మందికి పైగా పుష్య పౌర్ణమి స్నానం ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం సంక్రాంతి సందర్భంగా 13 అఖాడాలతో పాటు దేశ నలుమూలలకు చెందిన పలు ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, సాధుసంతులు తొలి షాహీస్నాన్ (రాజస్నానం) ఆచరించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రిన చివరి రాజస్నానంతో మేళా ముగియనుంది.
వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
144 ఏళ్లకు ఓసారి వచ్చే అత్యంత అరుదైన ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొనేందుకు విదేశీయులు కూడా భారీ సంఖ్యలో ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. స్థానికులు, భక్తులు, సాధుసంతులతో కలిసి శంఖాలూదుతూ, భజనలు చేస్తూ భక్తి భావనతో పులకించిపోయారు. ఈసారి కుంభమేళా ఆధ్యాత్మికత, సంస్కృతి, మత విశ్వాసాలు, సంప్రదాయాలతో పాటు అధునాతన టెక్నాలజీకి కూడా అద్దం పట్టేలా జరుగుతోంది. ‘ఏక్‌తా కా మహాకుంభ్’ హాష్‌ట్యాగ్ సోమవారం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.
భక్తులు, సాధవులు రాకపోకలకు ఏర్పాటు చేసిన 30 బల్లకట్టు వంతెనలతో పాటు ఈ మహా క్రతువును నిర్వహణకు కేటాయించిన 10 వేల ఎకరాల స్థలమూ కిక్కిరిసి కన్పిస్తోంది. 1.5 లక్షల మరుగుదొడ్లను 15 వేలకు పైగా పారిశుద్ధ కారి్మకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. మహాకుంభ్‌ను గ్రీన్, డిజిటల్, ప్లాస్టిక్‌రహితంగా యోగి సర్కారు ప్రకటించింది. తొలి రోజే మేళాలో తప్పిపోయిన 500 పై చిలుకు మందిని సొంతవారి చెంతకు చేర్చారు. 2 లక్షల గుడారాలతో వెలిసిన టెంట్ సిటీ ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలికంగా రికార్డు సృష్టించింది.
లక్షల్లో కల్పవాస దీక్షలు
తొలి రోజే లక్షలాది భక్తులు కల్పవాద దీక్ష తీసుకున్నారు. యూపీలోని బుందేల్‌ఖండ్‌కు చెందిన దినేశ్ స్వరూప్ బ్రహ్మచారికి ఇది వరుసగా 41వ కల్పవాసం కావడం విశేషం! దీక్షధారుల్లో యువత కూడా ఎక్కువ సంఖ్యలో కనిపించారు. వారిలో యూపీఎస్సీ వంటి అత్యున్నత పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వాళ్లు కూడా ఉన్నారు. కుంభమేళాలో నెలపాటు కల్పవాసం చేస్తే వందేళ్లు తపస్సు చేసిన ఫలం దక్కుతుందని పద్మపురాణం, మహాభారతం చెబుతున్నాయి. అందులో భాగంగా 21 రకాల నియమనిష్టలు పాటించాల్సి ఉంటుంది.
రూ.1,296కే హెలికాప్టర్ రైడ్
కుంభమేళా విహంగవీక్షణానికి హెలికాప్టర్ సేవలను యూపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.1,296 చెల్లించి 7 నిమిషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఆధ్యాత్మిక శోభను తిలకించవచ్చు. సంగమ ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా చేరే వెసులుబాటూ కల్పించారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటును నిర్దేశించారు.
ప్రత్యేకమైన రోజు ఇది: మోదీ, యోగి
భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని మహా కుంభమేళా ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ‘‘భక్తి, విశ్వాసం, సంప్రదాయాల సంగమం జాతి, మతం, సరిహద్దులకు అతీతంగా ఇన్ని కోట్ల మందిని ఒక్కచోటికి చేర్చింది. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది ప్రత్యేకమైన రోజు. పవిత్ర స్నానాలు ఆచరించి, దైవాశీస్సులు పొందేందుకు ఇంతమంది రావడం హర్షణీయం’’ అంటూ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన త్వరలో కుంభమేళాలో పాల్గొననున్నారు. మేళా ప్రాంతంలో భక్తులు మోదీ, యోగి కటౌట్ల వద్ద భారీగా ఫొటోలు దిగుతుండటం విశేషం.
అద్భుతం: విదేశీ భక్తులు
భారీ సంఖ్యలో పోటెత్తుతున్న వైనం
కుంభమేళాకు విదేశీయులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. వారిలో పలువురు ఆసక్తి, జిజ్ఞాస కొద్దీ వచ్చివారు కాగా చాలామంది పూర్తిస్థాయిలో సన్యాసులుగా మారి మోక్షమార్గం పట్టినవాళ్లు కూడా ఉండటం విశేషం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అర్థమైన మీదట మోక్షారి్థగా మారానని విదేశీ సన్యాసి బాబా మోక్షపురి చెప్పుకొచ్చాడు. అమెరికాకు చెందిన ఆయన పూర్వాశ్రమ నామం మైకేల్. సైన్యంలో పని చేశాడు. తర్వాత కొన్నేళ్ల క్రితం జునా అఖాడాలో చేరి సన్యాసం స్వీకరించాడు.
‘‘నాకిది తొలి కుంభమేళా. అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకంపనలతో పరవశించిపోతున్నా’’ అంటూ హర్షం వెలిబుచ్చాడు. రొమారియో (బ్రెజిల్), జూలీ (స్పెయిన్) తదితర విదేశీయులు కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు. కుంభమేళాలో పాల్గొనే మొత్తం భక్తుల సంఖ్యే ప్రపంచంలో సగం దేశాల జనాభా కంటే కూడా ఎక్కువని తెలిసి తెగ ఆశ్చర్యపోయినట్టు జూలీ చెప్పుకొచ్చింది. ‘‘అంతటి వేడుక ఎలా జరుగుతుందన్నది నా ఊహకు కూడా అందలేదు. అందుకే ప్రత్యక్షంగా చూసి తీరాలని వచ్చా’’ అని వివరించంది.
ప్రత్యేక ఆకర్షణగా స్టీవ్ జాబ్స్ భార్య
ఆపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె శనివారం వారణాసిలో విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం హైందవేతరులు విశ్వనాథ లింగాన్ని తాకేందుకు వీల్లేదు. దాంతో ఆమె తలపై దుపట్టా ధరించి గర్భాలయం వెలుపల నుంచే అభిõÙకంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం 40 మంది బృందంతో కలిసి శనివారం రాత్రి కుంభ్‌నగర్ చేరుకున్నారు.
నిరంజనీ అఖాడాకు చెందిన చెందిన స్వామి కైలాసానంద గిరి ఆశ్రమంలో బస చేశారు. పసుపు రంగు సల్వార్, చేతిలో రక్షసూత్రం, మెడలో రుద్రాక్ష మాలతో నిరాడంబరంగా సన్యాసి వేషధారణలో కనిపించారు. సంప్రదాయ మట్టి కప్పులో వేడివేడి మసాలా టీ ఆస్వాదించారు. ఆమె గురువారం దాకా కుంభమేళాలో పాలుపంచుకుంటారు. భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మికత అంటే లారెన్‌కు అపారమైన గౌరవమని స్వామి కైలాసానంద గిరి చెప్పారు. ఆమెకు కమలగా నామకరణం చేసినట్టు వివరించారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh: పుణ్యస్నానాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment