ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడీ నెలకొంది.సీ ట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలతో ప్రధాన పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ శనివారం 22 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రకాష్ భర్సకలే (అకోట్), దేవయాని ఫరాండే (నాసిక్ సెంట్రల్), కుమార్ అయాలానీ (ఉల్హాస్‌నగర్), రవీంద్ర పాటిల్ (పెన్), భీంరావ్ తాప్‌కిర్ (ఖడక్‌వాస్లా), సునీల్ కాంబ్లే (పూణే కంటోన్మెంట్), సమాధాన్ ఔతాడే (పంధర్‌పూర్). తొలి జాబితాలో 99 మంది పేర్లు ప్రకటించగా.. తాజా వాటితో కలిపి బీజేపీ మొత్తం 121 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
కాగా మహయూతి కూటమిలో భాగస్వామ్య పార్టీలైన శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇంకా సీట్లను ఖరారు చేయలేదు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడెనిమిది సీట్లు కేటాయింపుపై మిత్రపక్షాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే పేర్కొన్నారు.
ఎన్సీపీ(శరద్ పవార్) రెండో జాబితా విడుదల
ఇదిలా ఉండగా.. శరద్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరో 22 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ రెండో జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాము మొత్తం 67 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని పాటిల్ చెప్పారు. అన్ని స్థానాల్లో గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment