బీజేపీ ‘మహా’ షో వెనక... | The rise and rise of BJP in Maharashtra | Sakshi
Sakshi News home page

బీజేపీ ‘మహా’ షో వెనక...

Published Sun, Nov 24 2024 6:50 AM | Last Updated on Sun, Nov 24 2024 7:24 AM

The rise and rise of BJP in Maharashtra

ఐదు నెలల కిందటి ముచ్చట. గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 48 సీట్లకు ఆ పార్టీ సారథ్యంలోని అధికార మహాయుతి సంకీర్ణానికి దక్కింది కేవలం 17. అధికారం కోసం పుట్టుకొచి్చన అవకాశవాద కూటమి అంటూ అసలే ఇంటాబయటా విమర్శలు. పైపెచ్చు శివసేన, ఎన్సీపీలను చీల్చిందంటూ బీజేపీకి అంటిన మరక. కాంగ్రెస్‌ సారథ్యంలోని ఎంవీఏకు ఏకంగా 30 లోక్‌సభ స్థానాలు. ప్రభుత్వ వ్యతిరేకత. రైతులతో పాటు పలు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో విపక్ష ఎంవీఏ కూటమి జైత్రయాత్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగడం ఖాయమని, అధికార కూటమి పుట్టి మునగడం ఖాయమని జోరుగా విశ్లేషణలు. 

ఇన్ని ప్రతికూలతలను అధిగమిస్తూ బీజేపీ దుమ్ము రేపింది. దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మరోసారి రుజువు చేసుకోవడమే గాక అతి కీలకమైన పెద్ద రాష్ట్రంలోపై పూర్తిగా పట్టు సాధించడంలో కూడా కాషాయ పార్టీ విజయవంతమైంది. ఐదంటే ఐదు నెలల్లో మహారాష్ట్ర ప్రజల తీర్పులో ఇంతటి మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది! ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించలేక చతికిలపడ్డ బీజేపీ మహారాష్ట్రలో మరీ పేలవ ప్రదర్శనే చేసింది. 28 చోట్ల పోటీ చేసి 9 స్థానాలే గెలిచింది. 2019తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోయింది. కాంగ్రెస్, ఉద్ధవ్‌ శివసేన, శరద్‌ పవార్‌ ఎన్సీపీలతో కూడిన మహా వికాస్‌ అఘాడీ కూటమి మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుంది. 

అధికారం కోసం శివసేన, ఎన్సీపీలను చీలి్చనందుకు రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఇలా గట్టి గుణపాఠం చెప్పారంటూ కాంగ్రెస్‌ తదితర విపక్షాలన్నీ ఎద్దేవా చేశాయి. ఈ నేపథ్యంలో తాజా అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. సంకీర్ణ భాగస్వాములైన షిండే శివసేన, అజిత్‌ పవార్‌ ఎన్సీపీలతో కలసికట్టుగా తిరుగులేని ప్రదర్శన చేసి తీరాల్సిన అనివార్యతను పార్టీ ఎదుర్కొంది. కనీవినీ ఎరగనంతటి ఘనవిజయంతో ఈ కఠిన పరీక్షలో నెగ్గిన తీరు పరిశీలకులనే అబ్బురపరుస్తోంది. తరచి చూస్తే మహాయుతి సాధించిన అద్భుత ఫలితాలకు దోహదపడ్డ కారణాలెన్నో... 

మహిళల ఓట్లు 
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో వచ్చిన వ్యతిరేక ఫలితాలకు కారణాలను బీజేపీ విశ్లేíÙంచుకుని సకాలంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కూటమి పక్షాలను కలుపుకుని పోతూనే ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించింది. లోక్‌సభ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, వాటిని తూచా తప్పకుండా అమలు చేయడమే ఇంతటి విజయానికి కారణమని ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. ఎప్పట్లాగే ఈసారి కూడా రాష్ట్రంలో మహిళల ఓటింగ్‌ శాతం హెచ్చుగా నమోదైంది. దాంతో మహిళలకు, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలకు కూటమి బాగా ప్రాధాన్యమిచి్చంది. 

ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల్లోని 18–60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తూ ఇటీవలి బడ్జెట్లో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మఝీ లడ్కీ బెహన్‌ పథకం సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనితో ఏకంగా 2.35 కోట్ల మందికి లబ్ధి కలిగింది. నాటినుంచే వాతావరణం బీజేపీ కూటమికి అనుకూలంగా మారడం మొదలైంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయానికి ప్రధాన కారణమైన ఈ పథకం మహారాష్ట్రలోనూ పని చేసింది. ఈసారి గెలిస్తే ఆ మొత్తాన్ని రూ.2,100కు పెంచుతామని ప్రకటించడం అధికార కూటమికి మరింత కలిసొచ్చింది. తామొస్తే మహిళలకు నెలకు ఏకంగా రూ.3,000 ఇస్తామన్న ఎంవీఏ ప్రకటనను ప్రజలు పెద్దగా నమ్మలేదు. కర్నాటక వంటి రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం వంటి ఎన్నికల హామీలకు కాంగ్రెస్‌ కత్తెర వేయనుందన్న వార్తలు కూడా ఇందుకు కొంతవరకు కారణమని చెబుతున్నారు. 

లోక్‌సభతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఏకంగా 70 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. 
 వీటిలో 43 లక్షలు మహిళల ఓట్లే! వాటిలో అత్యధిక ఓట్లు మహాయుతికే పడ్డట్టు స్పష్టమవుతోంది. 

నిలబెట్టిన నినాదాలు
హిందూత్వ భావజాలంతో కూడిన దూకుడైన నినాదాలు ఈ ఎన్నికల్లో ఓట్లరపై గట్టిగా ప్రభావం చూపాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘కటేంగే తో బటేంగే’, మోదీ ఇచి్చన ‘ఏక్‌ హై తో సేఫ్‌ హై’నినాదాలు రాష్ట్రమంతటా మార్మోగాయి. ముస్లిం ఓటర్లు ఎంవీఏ వైపు సంఘటితం అవుతున్నారన్న సంకేతాలతో ప్రచారం చివరి దశలో ఈ నినాదాల జోరును బీజేపీ మరింత పెంచింది. బీజేపీ ‘ఓట్‌ జిహాద్‌’కు పాల్పడుతోందంటూ విపక్షాలు దుయ్యబడితే ఆ విమర్శలను కూడా తమకు అనుకూలంగా మలచుకుంది. వాటికి కౌంటర్‌గా రాష్ట్ర బీజేపీ అగ్ర నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇచ్చిన ‘ఓట్ల ధర్మయుద్ధం’వంటి నినాదాలు కూడా గట్టిగానే పేలాయి. 

ఓటు బదిలీ – పోల్‌ మేనేజ్‌మెంట్‌
గ్రామ, బూత్‌ స్థాయి దాకా బీజేపీ కూటమి ఎక్కడికక్కడ సమర్థంగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించింది. దీనికి తోడు మహాయుతి కూటమి పారీ్టల మధ్య ఓట్ల బదిలీ విజయవంతంగా జరిగింది. ఎంవీఏ కూటమి పారీ్టలు ఈ విషయంలో దారుణంగా విఫలమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో బాగా కలిసొచి్చన కులగణన కార్డు ఈసారి అంతగా పని చేయకపోవడానికి మహాయుతి పార్టీల మధ్య జరిగిన ఓట్ల బదిలీ ప్రధాన కారణంగా నిలిచింది. 

హిందూత్వ – ఆరెస్సెస్‌ దన్ను 
సర్వం మోదీమయంగా వ్యవహరిస్తున్న బీజేపీ తీరుపై దాని మాతృ సంస్థ ఆరెస్సెస్‌ తీవ్ర అసంతృప్తితో ఉందని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో పారీ్టతో అంటీముట్టనట్టుగా వ్యవహరించిందని వార్తలు రావడం తెలిసిందే. యూపీ వంటి కీలక రాష్ట్రాల్లో ఇది బీజేపీకి చాలా నష్టం చేసింది. మహారాష్ట్రలో అలా జరగకుండా పార్టీ ముందునుంచే జాగ్రత్త పడింది. దానికి తోడు ఈ ఎన్నికలను రాష్ట్రంలో బీజేపీకి చావో రేవో తరహా పోరాటంగా భావించి ఆరెస్సెస్‌ కూడా అన్నివిధాలా దన్నుగా నిలిచింది. రెండూ కలిసి హిందూత్వ భావజాలాన్ని రాష్ట్రంలో మూలమూలలకూ తీసుకెళ్లాయి. ఇందుకు సోషల్‌ మీడియాను కూడా విస్తృతంగా ఉపయోగించుకున్నాయి. ఈ విజయం తాలూకు ఘనతలో సింహభాగం ఆరెస్సెస్‌ కార్యకర్తలదేనన్న సీనియర్‌ జర్నలిస్టు ప్రకాశ్‌ అకోల్కర్‌ వ్యాఖ్యలే ఆ సంస్థ పోషించిన పాత్రకు నిదర్శనం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement