సాక్షి ముంబై: మహారాష్ట్రలో మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ఆంక్షలు పొడిగించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో మంత్రులందరు లాక్‌డౌన్ పొడిగించాలని సీఎంకు సూచించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. అయితే అధికారికంగా లాక్‌డౌన్ పొడిగింపునకు సంబంధించిన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటిస్తారని వైద్య శాఖమంత్రి రాజేశ్ టోపే వెల్లడించారు. కాగా, లాక్‌డౌన్ ముగియనుందని భావించిన చాలామందిలో నిరాశ కన్పించగా మరోవైపు అనేక మంది లాక్‌డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
సెకండ్ వేవ్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసుల సంఖ్య నమోదు కావడంతోపాటు మృతి చెందేవారి సంఖ్య కూడా పెరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో బ్రేక్ ది చైన్‌లో భాగంగా విధించిన లాక్‌డౌన్ కొంత మేర సఫలీకతమైంది. ముఖ్యంగా ఈ కరోనా విస్తరణ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మరో 15 రోజులపాటు లాక్‌డౌన్ కొనసాగించాలని మంత్రులందరు కోరారు. దీంతో లాక్‌డౌన్, టీకాల విషయాలపై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధికారిక ప్రకటన చేస్తారని రాజేష్‌టోపే మీడియాకు తెలిపారు. మరోవైపు కరోనా నియమ నిబంధనలన్ని పాటించాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సూచించింది. సోషల్ డిస్టేన్స్, తరచు చేతులు శుభ్రవపరచుకోవడం, ముఖాలకు మాస్కు ధరించడం మొదలగు మూడింటిని తప్పనిసరిగా పాటించాలని కోరింది.
44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ లేదు..
వ్యాక్సిన్ కొరత కారణంగా 18 నుంచి 44 ఏళ్ల వయసున్న వారికి కరోనా వ్యాక్సినేషన్ తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజేష్ టోపే పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. అయినప్పటికీ తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి ప్రకటిస్తారన్నారు. ఈ మేరక ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌టోపే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయసు వారికి కూడా మే 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ చేసేందుకు అనుమతించింది. టీకాల కొరత కారణం గా మహారాష్ట్రలోని కొన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలలో మాత్రమే 18 నుంచి 44 ఏళ్ల వయసున్నవారికి వ్యాక్సినేషన్ వేస్తున్నారు. టీకాల తీవ్ర కొరత ఉంది. మరోవైపు ఫస్ట్ డోస్ టీకా తీసుకున్నవారికి సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో తాత్కాలికంగా కొన్ని రోజులపాటు 44 ఏళ్ల లోపు వయసున్న వారికి వ్యాక్సినేషన్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment