సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో 24,886 కేసుల నమోదుకావడంతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 10,15,681కి చేరింది. ఇలా దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో ముందున్న మహారాష్ట్ర ప్రపంచంలోని అనేక దేశాలను వెనక్కినెట్టింది. కేసుల సంఖ్యలో మహారాష్ట్రను ఒక దేశంగా లెక్కిస్తే ప్రపంచ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. గతంలో అత్యధిక కేసులతో ముందున్న చైనా, కెనడా, ఇటలీ, జర్మనీ తదితరాలను మహారాష్ట్ర ఎప్పుడో అధిగమించింది.
తాజాగా ప్రస్తుతం 66.47 లక్షలతో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, 46.59 లక్షల కేసులతో భారత్ రెండో స్థానంలో ఉంది. 42.83 లక్షల కేసులతో బ్రెజిల్ మూడవ స్థానం. 10.57 లక్షల కేసులతో రష్యా నాల్గో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో నిల్చిన పెరూ దేశంలో 7.16 లక్షల కేసులున్నాయి. అయితే, మహారాష్ట్రలో 10 లక్షలు దాటడం గమనార్హం. మహారాష్ట్రలో రికవరీ సైతం గణనీయంగా ఉంది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,15,023కు చేరింది. ఇది 70.4 శాతం కావడం విశేషం. మరోవైపు మృతుల సంఖ్య సెప్టెంబర్ 12వ తేదీ నాటికి మృతి చెందినవారి సంఖ్య 2.83 శాతం (28,724) ఉంది.ఇక యాక్టివ్ కేçసుల సంఖ్య 2,71,566గా ఉంది.
దాదాపు నెల రోజుల్లో మరో 5 లక్షలు..
ఆగస్టు తొమ్మిదవ తేదీకి 5 లక్షలు దాటిన కరోనా మళ్లీ నెల రోజుల్లో సెప్టెంబర్ 12వ తేదీనాటికి మరో 5 లక్షల కేసులు పెరిగాయి. మరోవైపు, ఇలా కేవలం 5 రోజుల్లోనే లక్ష కొత్త కేసులు నమదయ్యాయి.
33 వేల చిన్నారులకూ..
సెప్టెంబర్ 7నాటి గణాంకాల ప్రకారం నవజాత శిశువుల నుంచి 10 ఏళ్లలోపు వయసున్న 33 వేల మందికి పిల్లలకు కరోనా సోకింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో సుమారు నాలుగు శాతం. 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసున్న కరోనా బాధితుల సంఖ్య 60 వేలు దాటింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో ఏడు శాతాన్ని మించింది.
దేశంలో ఒక్కరోజులో 97 వేలు
దేశంలో గత మూడు రోజుల నుంచి వరుసగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 97,570 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,59,984 కు చేరుకుంది. గత 24 గంటల్లో 81,533 మంది కోలుకోగా.. 1,201 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 77,472 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 36,24,196 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,58,316 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.56 శాతం ఉన్నాయి.
దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 77.77 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.66 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 11 వరకు 5,51,89,226 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం మరో 10,91,251 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 5.4 కోట్లకు పైగా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 442 మంది మరణించారు. మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment