
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో నానాటికీ పెరిగిపోతున్న అసమ్మతిని, యువ–సీనియర్ విభేదాలను కట్టడి చేయడంపై పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో 20 మందితో నూతన జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్న మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు యువ, సీనియర్ నేతలకు స్థానం కల్పించారు.
కొత్త కార్యవర్గాన్ని మమత త్వరలో ప్రకటిస్తారని సీనియర్ నాయకుడు పార్థ బెనర్జీ మీడియాకు తెలిపారు. భేటీలో అభిషేక్ కూడా పాల్గొన్నారు. తృణమూల్‌లో వృద్ధ, యువతరం నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. అభిషేక్ నాయకత్వంలో యువ నేతలు ‘ఒక వ్యక్తికి ఒకే పోస్టు’ నినాదాన్ని తెరపైకి తేవడం తెలిసిందే. జోడు పదవుల్లో ఉన్న పలువురు సీనియర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.