
దేశరాజధాని ఢిల్లీలోని షహ్దారాలోగల శాస్త్రి నగర్ ప్రాంతంలోని ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు, వారి తల్లిదండ్రులు ఊపిరాడక మరణించారు. మృతులను మనోజ్ (30), అతని భార్య సుమన్ (28), ఐదు, మూడేళ్ల వయసున్న ఇద్దరు బాలికలుగా అధికారులు గుర్తించారు.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఫైర్ సర్వీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. సీనియర్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ఘటనలో నలుగురు ఊపిరాడక మృతి చెందారని తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిందని, పార్కింగ్‌లో మంటలు చెలరేగడంతో భవనం అంతటా పొగలు వ్యాపించాయన్నారు. రోడ్డు ఇరుకుగా ఉన్నప్పటికీ అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.