సోమవారం (ఆగస్టు 26) శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని మధురలో గల శ్రీకృష్ణుని ఆలయం సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తుల కోసం 20 గంటల పాటు తెరిచివుంటుందని శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ తెలిపింది.
మధుర శ్రీకృష్ణుని ఆలయంలో నేటి (శనివారం) నుంచి ఉత్సవాలు ప్రారంభమై గురువారం వరకు కొనసాగుతాయని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవాసమితి కార్యదర్శి కపిల్ శర్మ, సభ్యులు గోపేశ్వర్ చతుర్వేది తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని 20 గంటల పాటు తెరిచి ఉంచుతామన్నారు. సోమవారం స్వామివారి మంగళ హారతి కార్యక్రమంలో షెహనాయ్ వాదన ఉంటుందన్నారు. ఉదయం 5.30 నుండి దర్శనాలు మొదలువుతాయన్నారు. ఉదయం 11.00 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం జరుగుతుందన్నారు.
జన్మాష్టమి నాడు సాయంత్రం వేళ శ్రీకృష్ణ లీలా మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో భరత్‌పూర్ గేట్ నుంచి ఊరేగింపు ప్రారంభమై హోలీగేట్, ఛట్టా బజార్, స్వామి ఘాట్, చౌక్ బజార్, మండి రాందాస్, డీగ్ గేట్ మీదుగా శ్రీకృష్ణ జన్మస్థలానికి చేరుకుంటుందన్నారు. ఆలయంలో స్వామివారి అలంకరణ అద్భుతంగా ఉండబోతుందని అన్నారు. ఆలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో జిల్లా యంత్రాంగం షూ షెడ్లు, లగేజీ షెడ్లు ఏర్పాటు చేసిందన్నారు. అలాగే వైద్య శిబిరాలు, విచారణ కేంద్రాలు కూడా ఏర్పాటవుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment