భోపాల్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు వినూత్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 3న రక్షా బంధన్ సందర్భంగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె చేత రాఖీ కట్టించుకోవాలని ఆదేశించింది. అంతేగాక పండుగ సందర్భంగా సోదరికి అందజేసే కానుకల కింద రూ. 11 వేలు బహుమతిగా ఇవ్వాలని, ఆమె కొడుకుకు మరో రూ. 5 వేలు అందజేయాలని పేర్కొంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇవన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. (మైనర్ అంగీకారంతోనే జరిగి ఉంటుంది.. కాబట్టి)
అదే విధంగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, రసీదులు కోర్టుకు సమర్పించాలని, అయితే తదుపరి విచారణపై ఈ అంశాలు ఎటువంటి ప్రభావం చూపవని స్పష్టం చేసింది. కేవలం బెయిలు పొందేందుకు మాత్రమే ఈ షరతులు వర్తిస్తాయని తెలిపింది. వివరాలు.. ఈ ఏడాది జూన్‌లో సదరు నిందితుడిపై లైంగిక ఆరోపణల కింద కేసు నమోదైంది. పొరుగింట్లో ప్రవేశించి మహిళపై అత్యాచార యత్నం చేసినట్లు ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడు బెయిలు కోసం అర్థించగా జూలై 30న కేసును విచారించిన ఇండోర్ ధర్మాసనం రూ. 50 వేల పూచీకత్తు కింద బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా.. ‘‘నిందితుడు తన భార్యతో కలిసి ఆగష్టు 3, 2020న ఉదయం 11 గంటలకు బాధితురాలి ఇంటికి వెళ్లాలి. ఆమె చేత రాఖీ కట్టించుకోవాలి. తనకు అన్ని విధాలుగా రక్షగా ఉంటాననే హామీ ఇవ్వాలి. (ఈ చెత్తనంతా భరించలేం: సుప్రీంకోర్టు)
ఈ సంప్రదాయం ప్రకారం సోదరీమణులకు సోదరులు ఇచ్చే కానుక కింద రూ. 11 వేలు ఇవ్వాలి. ఆమె కొడుకుకు దుస్తులు, స్వీట్లు కొనుగోలు చేసేందుకు మరో రూ. 5 వేలు ఇవ్వాలి. ప్రాణాంతక వైరస్ విస్తరిస్తున్నందున కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సామాజిక దూరం, పరిశుభ్రత, మాస్కు ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి’’అని జస్టిస్ రోహిత్ ఆర్య పేర్కొన్నారు. కాగా ఇటీవల గ్వాలియర్ బెంచ్ సైతం హత్యాయత్నం చేసిన ఓ వ్యక్తికి వింతైన షరతులతో బెయిలు మంజూరు చేసింది. గ్వాలియర్ జిల్లా ఆస్పత్రిలో చైనా వెలుపల తయారు చేసిన ఎల్‌ఈడీ టీవీని పెట్టించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment