ముంబై: భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని చిగురుటాకులా వణికిపోతుంది. అధిక వర్షాలతో ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటకు 107 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ప్రభుత్వం ఇప్పటికే సబర్బన్ రైలు, బస్సు సేవలను నిలిపివేసింది. ఇక ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ వంటి పర్యాటక ప్రదేశాలు కలిగిన దక్షిణ ముంబైలోని కొలాబాలో అధిక వర్షపాతం నమోదయ్యింది. గత 46 సంవత్సరాల్లో.. ఆగస్టు నెలలో.. ఒక్క రోజులో ఇంత భారీ వర్షపాతం నమోదవ్వడం ఇదే ప్రథమం అంటున్నారు అధికారులు. గడిచిన 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 331.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఆగస్టు నెల పూర్తి వర్షపాతంలో దాదాపు 64 శాతం వాన ఈ ఐదు రోజుల వ్యవధిలోనే నమోదయినట్లు అధికారులు తెలిపారు. (ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే.)
అధిక వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర సేవలు మినహా అన్ని కార్యాలయాలను మూసి వేసింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరారు. ముంబై, పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment