సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ముంబైలో కొన్ని లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, కూలీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో మెట్రో రైళ్ల ట్రిప్పుల సంఖ్య పెంచాలని ఎమ్మెమ్మార్డీయే నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సుమారు 30 శాతం ట్రిప్పులు పెరగనున్నాయి. ఇదివరకు రెండు రైళ్ల మధ్య 15 నిమిషాల వ్యత్యాసముండేది. కానీ సోమవారం నుంచి ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రతి 10 నిమిషాలకు ఒక మెట్రో రైలును నడపాలని ఎమ్మెమ్మార్డీయే నిర్ణయం తీసుకుంది. దీంతో రోజు 130 ట్రిప్పులు మెట్రో రైళ్లు తిరగనున్నాయి.
రద్దీని దృష్టిలో ఉంచుకుని..
మొదటి దశలో ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు, రెండో దశలో ఈ నెల ఒకటో తేదీ నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు మాత్రమే అనుమతి ఉండేది. శని, ఆదివాలు బంద్ పాటించాల్సి వచ్చేది. కానీ తాజా సడలింపుల నేపథ్యంలో ఉదయం ఏడు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు షాపులు, ఇతర వ్యాపార సంస్థలు పనిచేసుకునేలా వెసులుబాటు లభించింది. దీంతో శివారు, ఉప నగరాల నుంచి విధులకు వచ్చే ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల సంఖ్య పెరగనుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్ల ట్రిప్పులు పెంచాలని ఎమ్మెమ్మార్డీయే నిర్ణయం తీసుకుంది. రద్దీ తక్కువ ఉండే సమయంలో 15 నిమిషాలకు ఒక రైలు, ఉదయం, సాయంత్రం రద్దీ ఉండే సమయంలో ప్రతీ 10 నిమిషాలకు ఒక రైలు నడపుతున్నట్లు ప్రకటించింది.
సిబ్బందికి మొదటి డోసు పూర్తి
మెట్రో–1 ప్రాజెక్టులో వర్సోవా–అంధేరీ– ఘాట్కోపర్ మధ్య మెట్రో రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా విడుదల చేసిన టైం టేబుల్ ప్రకారం ప్రతీరోజు ఉదయం 6.50 గంటలకు మొదటి రైలు వర్సోవా స్టేషన్ నుంచి బయలు దేరుతుంది. చివరి రైలు ఘాట్కోపర్ స్టేషన్ నుంచి రాత్రి 10.15 గంటలకు బయలు దేరనుంది. ఉదయం మొదటి రైలు బయలు దేరడానికి 15 నిమిషాల ముందు ప్రయాణికులను స్టేషన్‌లోకి అనుమతిస్తారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు 18–44 ఏళ్ల మధ్య వయసున్న 400పైగా మెట్రో సిబ్బందికి మొదటి కరోనా డోసు వేసినట్లు మెట్రో–1 తెలిపింది. అలాగే 45 ఏళ్ల పైబడిన సిబ్బందికి మొదటి డోసు ఏప్రిల్‌లోనే వేసినట్లు తెలిపింది. దీంతో కరోనా వైరస్‌పై ప్రయాణికులెవరూ ఆందోళన చెందవద్దని మెట్రో–1 స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment