
ముంబై: ఓ పెద్ద మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ రైలు పట్టాల మీద తచ్చాడాడు. ఇది చూసిన పోలీసు వెంటనే పరుగుపరుగున వచ్చి అతడిని పైకి లాగి రక్షించిన ఘటన శుక్రవారం నాడు ముంబైలోని దహీసర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అరవై ఏళ్ల పెద్దాయన రైల్వే పట్టాల మీదకు ఎక్కాడు. ఇంతలో రైలు కూత వినపడటంతో కంగారుగా వెనక్కు రాబోయాడు. ఈ క్రమంలో అతడి చెప్పు ఊడిపోయింది. అయితే తన ప్రాణం కన్నా కింద పడిన చెప్పే ముఖ్యమన్నట్లుగా వెళ్లి దాన్ని తీసుకున్నాడు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న పోలీసు వెంటనే పరుగెత్తుకొచ్చి.. "పట్టాల మీదకు ఎక్కకుండా అక్కడే ఉండు, లేదంటే ఎడమ వైపు దూకేయ్" అని సలహా ఇచ్చాడు. దీన్ని పెద్దగా పట్టించుకోని వ్యక్తి రైలు వచ్చేలోగా ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. (చదవండి: అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు..)
వెంటనే పట్టాల మీదుగా పరుగెత్తగా సరిగ్గా అప్పుడే ట్రెయిన్ వేగంగా దూసుకొచ్చింది. దీంతో అక్కడ ఉన్న పోలీసు అతడిని ప్లాట్‌ఫామ్ మీదకు లాగి కాపాడాడు. కానీ తన సూచన పాటించకుండా నిర్లక్క్ష్యంగా వ్యవహరించిన సదరు వ్యక్తి చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటన అంతా అక్కడి కెమెరాలలో రికార్డవగా, ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. రైల్వే ట్రాక్ మీద నడవద్దన్న నిబంధనను ఆ వ్యక్తి తుంగలో తుక్కాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తిని పోలీసు కొట్టడాన్ని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం హెచ్చరిస్తే సరిపోయేదని అభిప్రాయపడుతున్నారు. (చదవండి: ఆశ్చర్యం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు!)
Comments
Please login to add a commentAdd a comment