
ఇలాంటి నిస్వార్థ, దయగల మహిళను ఇంతవరకు చూడలేదని, మానవత్వం, దయాగుణం ఇంకా బతికే ఉన్నాయని ఆ మహిళ నిరూపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ముంబై : గజిబిజి పరుగుల జీవితంలో మన కోసం మనం కేటాయించే సమయమే తక్కువ. ఇక పక్కవారి గురించి ఏం ఆలోచిస్తాం? కానీ ఓ మహిళ మాత్రం మానవత్వం, సాటివారిని పట్టించుకునే తత్వం ఇంకా ఉన్నాయనే నిరూపించారు. భారీ వర్షంలోనూ దాదాపు 5గంటల పాటు రోడ్డుపై నిలబడి వాహనదారులు మ్యాన్‌హోల్ ప్రమాదానికి గురికాకుండా కాపాడారు. ట్రాఫిక్ పోలీసు మాదిరి సంజ్ఞలు చేస్తూ మ్యాన్‌హోల్ గురించి వాహనదారులను హెచ్చరించింది. ప్రస్తుతం ఆ మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. (చదవండి : లాప్‌టాప్ లాక్కెళ్లిన పంది.. నగ్నంగా అడవంతా..)
5గంటలు వర్షంలోనే
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరపిలేని వర్షాలతో ముంబై చిగురుటాకులా వణుకుతోంది. జనజీవనం స్తంభించింది. పశ్చిమ ముంబైలోని రోడ్లన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపై ఓ మ్యాన్‌హోల్ తెరచి ఉండడం ఓ మహిళ గమనించింది. ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనాదారులకు చెప్పాలనుకుంది. వెంటనే మ్యాన్‌హోల్ దగ్గర నిలబడి అటువైపుగా వస్తున్న వాహనదారులను హెచ్చరించింది. ట్రాఫిక్ పోలీసు మాదిరి సంజ్ఞలు చేస్తూ వాహనాలను మళ్లించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై హీరోయిన్ మంచు లక్ష్మి సైతం స్పందించారు. ఈ వీడియో చూశాక మాటలు రావడం లేదంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి నిస్వార్థ, దయగల మహిళను ఇంతవరకు చూడలేదని, మానవత్వం, దయాగుణం ఇంకా బతికే ఉన్నాయని ఆ మహిళ నిరూపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.