
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వల్లే సీబీఐ కార్యాలయంపై తృణమూల్ పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని సీబీఐ కోల్‌కతా హైకోర్టుకు వివరించింది. నారదా కేసును రాష్ట్రం వెలుపల విచారించేలా కేసు బదిలీకి అనుమతివ్వాలని, అరెస్టయిన నలుగురు నిందితులనూ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ బుధవారం కోర్టును కోరింది.
నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో రెండు రోజుల క్రితం సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అదే రోజు స్థానిక కోర్టు వారికి బెయిల్ మంజూరు చేయడంతో, వెంటనే సీబీఐ హైకోర్టుకు వెళ్లింది. దాంతో నిందితుల బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది
నేడు కోల్‌కతా హైకోర్టు ఈ కేసును విచారించింది. సీబీఐ ఆఫీసు ముందు ముఖ్యమంత్రి అధ్వర్యంలో తృణమూల్ కార్యకర్తలు భయోత్పాతం సృష్టించడం వల్లే సోమవారం కోర్టుకు వచ్చి నిందితుల కస్టడీని కోరలేకపోయామని సీబీఐ వివరించింది. భారీ గుంపులను తీసుకొని వచ్చిన మమత.. సీబీఐ ఆఫీసు ముందు నానా రచ్చ చేశారని ఆరోపించింది. ఆమె రెచ్చగొట్టడం వల్లే వేలాది మంది దుండగులు సీబీఐ ఆఫీసుపైకి రాళ్లు విసిరారని పేర్కొంది.
సీబీఐ అధికారులను బెదిరించి, భయపెట్టాలన్న ఉద్దేశంతోనే ఆమె ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించింది. తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా మమత సర్కార్ అడ్డుకుంటోందని ఆక్షేపించింది. అలాంటి సందర్భంలో నిందితులను కోర్టుకు తీసుకొస్తే.. దారి మధ్యలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తొచ్చన్న ఉద్దేశంతోనే సోమవారం కోర్టుకు రాలేదని సీబీఐ పేర్కొంది.
చదవండి: West Bengal: ఇద్దరు మంత్రుల అరెస్ట్, టీఎంసీలో కలవరం
Comments
Please login to add a commentAdd a comment