
పుణే: కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ(షిండే వర్గం పొత్తు) పాలనపై విమర్శలు గుప్పించే క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య కారణంగానే.. పెళ్లీడుకొచ్చినా యువకులకు అమ్మాయిలు దొరకడం లేదని అన్నారు.
బుధవారం ఎన్సీపీ జన్ జాగర్ యాత్ర ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండు వర్గాల ప్రజల మధ్య చీలిక ఏర్పడింది. తద్వారా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం జరుగుతోంది. నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. చేసుకునేందుకు వేరే పనులు కూడా దొరకడం లేదు. ఉద్యోగం లేని వాళ్లకు పిల్లను ఎవరు ఇస్తారు? అందుకే వివాహాలు సకాలంలో జరగడం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. బాగా చదువుకున్న వాళ్లు.. తమకు ఉద్యోగాలు కావాలని ప్రభుత్వాల్ని నిలదీయాలి. అది వాళ్ల హక్కు కూడా అని పవార్ సూచించారు.
దేశంలో రైతులు ఉత్పత్తి పెంచితే ఆకలి సమస్య తీరుతుంది. కానీ, అధికారంలో ఉన్నవారు రైతుల శ్రమకు తగ్గ గిట్టుబాటు ధర ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. బదులుగా.. దళారుల ప్రయోజనాలను కాపాడుతూ సామాన్య ప్రజలను ద్రవ్యోల్బణ చట్రంలోకి నెట్టేస్తున్నారు అంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు ఈ కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి.
‘‘ఓసారి నేను ఓ ఊరికి వెళ్లాను. అక్కడ పాతిక నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న కొందరు యువకులు పిచ్చాపాటిగా మాట్లాడుతూ కనిపించారు. ఎందుకిలా ఖాళీగా ఉన్నారు అని అడిగితే.. తమ ప్రాంతంలో చేయడానికి ఏం పనుల్లేవని బదులిచ్చారు. వాళ్లలో కొందరు డిగ్రీలు, మరికొందరు పీజీలు కూడా చేశారు. పని కోసం వేరే ఊరు వెళ్లొచ్చు కదా అంటే.. ఎంత దూరం వెళ్లాలని వాళ్లే నన్ను ప్రశ్నించారు. పని లేక పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని వాళ్లు నాతో చెప్పారు’’ అని పవార్ గుర్తు చేసుకున్నారు.
ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించారు. దేశంలో రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగులుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే.. ఎన్నికల హామీలను నెరవేర్చే దమ్ము వాళ్ల దగ్గర లేదు కాబట్టి అంటూ కేంద్రంలోని బీజేపీపై ఆయన ఘాటు విమర్శ చేశారు. ఇక మహారాష్ట్రలోనూ అలాగే ఉందన్న ఆయన.. తమ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కొలువు దీరాక రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని, తద్వారా రాష్ట్రంలోనూ నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని పవార్ ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment