కర్ఫ్యూతో మళ్లీ రోడ్డున పడతాం! | New corona Curfew Gives Lose Again In Business In Maharashtra | Sakshi
Sakshi News home page

కర్ఫ్యూతో మళ్లీ రోడ్డున పడతాం!

Published Thu, Dec 24 2020 8:56 AM | Last Updated on Thu, Dec 24 2020 2:01 PM

New corona Curfew Gives Lose Again In Business In Maharashtra - Sakshi

సాక్షి, ముంబై: బ్రిటన్‌లో కరోనా మరో రూపం వేగంగా వ్యాప్తిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 5 వరకు రాత్రిళ్లు కర్ఫ్యూ విధించాలని తీసుకున్న నిర్ణయంపై ముంబైలోని హోటల్, రెస్టారెంట్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంపాదించుకునే సమయంలోనే కర్ఫ్యూ అమలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌తో గత తొమ్మిది నెలల నుంచి వ్యాపార సంస్థలన్నీ కుదేలైపోయాయి. ఆదాయం లేక ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నా రు. కాగా, అన్‌లాక్‌ ప్రక్రియ అమలు చేయడంతో ఇప్పుడిప్పుడే ముంబై జనజీవనం గాడినపడుతోంది. దీంతో కస్టమర్లు మెల్లమెల్లగా ఇంటి నుంచి బయటపడసాగారు. కానీ, ప్రభుత్వం రాత్రి 11 నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు కర్ఫ్యూ విధించి పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది.

కర్ఫ్యూ ఉంటే కస్టమర్లు ఇంటి నుంచి బయటకు రారు. ముంబైతోపాటు పుణేలో హోటల్, రెస్టారెంట్‌ అసోసియేషన్‌లో సుమారు పదివేల మంది సభ్యులున్నారు. వీరితోపాటు చిన్న, చితక తినుబండారాలు విక్రయించే 15 వేలకుపైగా వ్యాపారులున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వీరంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం నుంచి క్రిస్మస్‌ వేడుకలు, ఆ తరువాత థర్టీ ఫస్ట్, నూతన సంవత్సర వేడుకలుంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు లక్షలాది జనాలు ఇంటి నుంచి బయటపడతారు. ఆ రోజు ముంబైలో ఎక్కడ చూసినా జనాలు కిక్కిర్సి ఉంటారు. దీంతో కరోనా కారణంగా ఆర్థికంగా నష్టాలను చవిచూసిన వ్యాపారులు ఈ వేడుకల సమయంలో కొనుగోలుదారులను ఆకర్షించి కొంత సంపాదించుకోవాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు. నష్టాన్ని పూడ్చుకునేందుకు మంచి అవకాశం లభించిందని హోటల్, రెస్టారెంట్ల యజమానులు భావించారు. కానీ, ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది.  

పెంచిస్తారనుకుంటే.. 
ఉత్సవాల సమయంలో రెండు గంటలు సమ యం పెంచివ్వాలని రెస్టారెంట్ల యజమాను లు డిమాండ్‌ చేసిన విషయం విదితమే. కానీ, రాత్రి 11 నుంచి తెల్లవారు జామున ఆరు గంటల వరకు కర్ఫ్యూ విధించి వారి ఆశలపై నీళ్లు చల్లింది. 11 గంటల నుంచి కర్ఫ్యూ అమలులోకి రావడంతో రెస్టారెంట్లు పది గంటల నుంచి కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడం మానేయాల్సి ఉంటుంది. అంతేగాకుం డా అంతకు ముందు ఆర్డరు ఇచ్చిన వారు కూడా తొందరలోనే భోజనం ముగించాల్సి ఉంటుంది. లేదంటే పోలీసులు, బీఎంసీ అధికారులు జరిమానా విధిస్తారు. దీంతో కస్టమర్ల వల్ల వచ్చే ఆదాయం కంటే జరిమానా చెల్లించడం అదనపు భారం కానుంది. దీంతో 10 గంటల తరువాత కస్టమర్లను హోటల్‌లోకి రానియకుండా అడ్డుకోవడమే ఉత్తమని కొందరు యజమానులు భావిస్తున్నారు.

కస్టమర్లు విధులు ముగించుకుని ఇంటికెళ్లి ఫ్రెష్‌ అయిన తరువాత 8.30 లేదా తొమ్మిది గంటల సుమారులో హోటల్‌కు రా వడం మొదలవుతుంది. కాని కర్ఫ్యూ కారణం గా ఆదరబాదరగా భోజనం ముగించుకుని బయపడక తప్పదంటున్నారు. టేబుల్స్‌ ఖాళీ లేకపోవడంవల్ల కొందరు భోజనం చేయకుండానే వెనుదిరుగుతున్నారు. ఫలితంగా తమ ఆదాయానికి భారీగా గండిపడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ఫ్యూ వల్ల పర్యాటకులెవరూ దరిదాపులకు రాకపోవడం తో బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు, విద్యుత్‌ బిల్లులు, అందులో పనిచేసే కారి్మకులకు వేతనాలు ఎలా చెల్లించాలో తెలియక యజమానులు అందోళనలో పడిపోయారు.

రిసార్టులకు భారీ నష్టం.. 
కోవిడ్‌–19 కారణంగా గత తొమ్మిది నెలల నుంచి పర్యాటక ప్రాంతాలలో కస్టమర్లు లేక రిసార్టులు, ఫార్మ్‌ హౌజ్, గెస్ట్‌ హౌజ్, లాడ్జింగ్, వాటర్‌ పార్క్‌ యజమానులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. డిసెంబరులో జరిగే క్రిస్మస్‌ వేడుకలు, థర్టీ ఫస్ట్, నూతన సంవత్సర వేడుకల కారణంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. దీంతో ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు మంచి అవకాశం దొరికిందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, యూరప్‌ దేశాలలో కొత్తగా వెలుగులోకి వచి్చన కరోనా కారణంగా ఏకంగా కర్ఫ్యూ విధించారు. నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో మాథేరాన్, నేరల్, లోణావాల, ఖండాల, కర్జత్‌ తదితర పర్యాటక ప్రాంతాల్లో 200పైగా రిసార్టులు, ఫాం హౌజ్‌లు, హోటళ్లు, లాడ్జింగులు ఉన్నాయి.

ఇక్కడికి ఏటా ముంబై నుంచి లక్షల్లో పర్యాటకులు వస్తారు.  కానీ, ఈ ఏడాది కర్ఫ్యూ కారణంగా ఈ పర్యాటక ప్రాంతాలన్ని వెలవెలబోనున్నాయి. పర్యాటకులపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అంతేగాకుండా టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ కంపెనీలు, ప్రైవేట్‌ వాహనాల యజమానులు కూడా అనేక ఆశలు పెట్టుకున్నారు. కాని వారి ఆశలు కూడా వడియాశలయ్యే ప్రమాదం ఏర్పడింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement