
సాక్షి, హైదరాబాద్: కోతిపుండు బ్రహ్మరాక్షసైనట్టు.. కోవిడ్ సమస్య రోజు రోజుకూ జటిలమవుతూ పోతోంది. నిన్నమొన్నటి దాకా ఉన్న ఒక్క వైరస్ ఇప్పుడు పలు రూపాల్లోకి మారిపోవడం ఇందుకు కారణం. తాజా సమాచారం ప్రకారం గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో గుర్తించి డెల్టా వేరియంట్ ఇంకోసారి మార్పులకు గురైంది. ‘డెల్టా +’ గా పిలుస్తున్న ఈ కొత్త రూపాంతరిత వైరస్ మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు లొంగదని వైద్యనిపుణులు అనుమానిస్తున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ప్రజారోగ్య విభాగం కరోనా వైరస్ జన్యుక్రమాలపై జరుపుతున్న పరిశీలనల్లో ఈ ‘డెల్టా +’ గురించి తెలిసింది. ఇప్పటివరకూ తాము ‘డెల్టా +’ రూపాంతరిత జన్యుక్రమాలు దాదాపు 63 గుర్తించామని, ఇవన్నీ కే417ఎన్ అనే జన్యుమార్పును కలిగి ఉన్నాయని సంస్థ చెబుతోంది.
ఈ నెల ఏడవ తేదీ నాటికి భారత్‌లో ఆరు ‘డెల్టా +’ కేసులు ఉన్నట్లు సమాచారం. డెల్టా + రూపాంతరితం రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పేయగలదని, మోనోక్లోనల్ యాంటీబాడీ మందులు కాసిరివిమాబ్, ఇమ్డెవిమామ్‌లకు లొంగే అవకాశాలు తక్కువని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీకి చెందిన కంప్యూటేషనల్ బయాలజిస్ట్ డాక్టర్ వినోద్ స్కారియా ఆదివారం ఒక ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు భారత్‌లో డెల్టా రూపాంతరితం ఇంకా పరిణమిస్తోందని, కొత్త కొత్త జన్యుమార్పులకు గురవుతోందని ఈయన ఇంకో ట్వీట్ ద్వారా తెలిపారు. కే417ఎన్ జన్యుమార్పులు లేకున్నా డెల్టా రూపాంతరితంలో కొత్త మార్పులు చోటు చేసుకోవడం విశేషమని అన్నారు. వైరస్ కొమ్ము ప్రొటీన్‌లో కే417ఎన్ జన్యుమార్పు జరిగిందని, ఈ ఏడాది మార్చిలో దీన్ని యూరప్‌లో తొలిసారి గుర్తించామని యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజారోగ్య విభాగం చెబుతోంది. ఈ ‘కే417ఎన్’ మార్పు ఇప్పటికే గుర్తించిన దక్షిణాఫ్రికా రూపాంతరితంలోనూ ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment