Omicron Effect: No Night Curfew in Tamil Nadu, Mk Stalin Holds High Level Meeting - Sakshi
Sakshi News home page

Omicron Effect: నూతన సంవత్సర వేడుకలు రద్దు!

Published Sat, Dec 25 2021 6:34 AM | Last Updated on Sat, Dec 25 2021 7:54 AM

No Night Curfew in Tamil Nadu, Mk Stalin Holds High Level Meeting - Sakshi

పండుగ సీజన్‌లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఎంకే స్టాలిన్‌ అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్‌ కట్టడి చర్యలు విస్తృతం చేయాలన్నారు. మరోవైపు నిబంధనలు కఠినం చేయాలని ముఖ్యమంత్రికి వైద్య బృందాలు సూచించాయి. ఇప్పట్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేయాల్సినంతర పరిస్థితులు రాష్ట్రంలో లేవని పేర్కొన్నాయి.  

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం నాటికి 31 మంది చికిత్స పొందుతున్నారు. మరో 30 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అధికారులతో సీఎం స్టాలిన్‌ సచివాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. మంత్రులు ఎం సుబ్రమణియన్, శేఖర్‌ బాబు, సీఎస్‌ ఇరై అన్భు, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, డీజీపీ శైలేంద్ర బాబు, చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌ దీప్‌ సింగ్‌బేడీలు హాజరయ్యారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య బృందాలు తమ అభిప్రాయలు వ్యక్తం చేశాయి.

అధికారులతో సీఎం స్టాలిన్‌ సమావేశం  

నిబంధనలు కఠినం చేయండి 
నిబంధనలు, ఆంక్షలు కఠినం చేయాలని సీఎంకు వైద్య బృందాలు సూచించాయి. ప్రస్తుతం పండుగ సీజన్‌ ఆరంభమైందని, మరింత అప్రమత్తంగా ఉండడంతో పాటు ఒమిక్రాన్‌ కట్టడి చర్యలు విస్తృతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా కట్టడి సేవల నిమిత్తం నియమించిన కాంట్రాక్టు  సిబ్బంది పదవీ కాలం ఈనెల 31తో ముగియనుండడంతో పొడిగింపు విషయంగా చర్చించినట్టు తెలిసింది.

నైట్‌ కర్ఫ్యూకు ఎలాంటి అవకాశం లేదని, కొత్త వేడుకలు రద్దు చేయడం లేదా ఆంక్షలు కఠినం చేసే అవకాశాలు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక ఇంటింటా వ్యాక్సిన్‌ కార్యక్రమం విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టారు. ముందుగా సచివాలయంలో సీఎం స్టాలిన్‌ పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. దేవదాయ శాఖ పరిధిలోని  పాఠశాలల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు గౌర వేతనం రూ. వెయ్యి నుంచి రూ. 3 వేలకు పెంచారు. అలాగే రూ. 15 కోట్లతో 64 వేల మంది రైతులకు వ్యవసాయ ఉపకరణల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
 
ప్రత్యేక కమిటీ 
ఒమిక్రాన్‌ కట్టడికి నిపుణుల కమిటీని రంగంలోకి దించేందుకు నిర్ణయించినట్టు ఆరోగ్యమంత్రి ఎం సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. తాంబరంలో కరోనా నుంచి కోలుకున్న రోగులకు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆరోగ్య మంత్రి ప్రారంభించారు. ఒమిక్రాన్‌ కేసులు, చికిత్స, కట్టడి చర్యల గురించి వివరించారు.  

►ఒమిక్రాన్‌ కేసుల నేపథ్యంలో రెండు డోసుల టీకా వేసుకున్న వారికే ఊటీ సందర్శనకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.  
►ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఒకటో తేదీ శనివారం, 2వ తేదీ ఆదివారం కావడంతో 3వ తేదీ పాఠశాలలు తెరుచుకోనున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement