పదేళ్లుగా ఈశాన్యంలో శరవేగంగా అభివృద్ధి
ఢిల్లీలో అష్టలక్ష్మీ మహోత్సవం ప్రారంభ వేడుకల్లో మోదీ
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అక్కడ తక్కువ జనాభా ఉండడం, తక్కువ ఓట్లు, తక్కువ సీట్లు ఉండడమే ఇందుకు కారణమని చెప్పారు. గతంలో అధికారం చెలాయించిన ప్రభుత్వాలు ఓట్ల రాజకీయం చేశాయని ఆక్షేపించారు. ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాలపైనే దృష్టి పెట్టాయని చెప్పారు.
ఓట్లతో అభివృద్ధిని తూకం వేసే విధానం సరైంది కాదన్నారు. ఈశాన్య ప్రాంతాల వేడుక అయిన ‘అష్టలక్ష్మీ మహోత్సవ్’ను ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వమే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి శాఖలో 20 శాతం నిధులను ఈశాన్య ప్రాంతాల ప్రగతి కోసమే ఖర్చు చేసేలా చర్యలు తీసుకుందని చెప్పారు.
గత పదేళ్లగా ఈశాన్యంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. ఇదంతా సులభంగా జరగలేదని, దేశ అభివృద్ధి ప్రయాణంతో ఈశాన్యాన్ని అనుసంధానించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తూర్పు, ఈశాన్య భారతదేశంలో అద్భుతాలు చూడబోతున్నామని వ్యాఖ్యానించారు.
ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తరహాలో గౌహతి, షిల్లాంగ్, ఇంఫాల్, ఈటా నగర్, ఐజ్వాల్ వంటి నగరాలు ప్రగతి పథంలో దూసుకుపోవడం ఖాయమని ఉద్ఘాటించారు. దేశ అభివృద్ధి చరిత్రలో ఈశాన్యం పాత్ర కీలకంగా మారుతుందని అన్నారు. గత పదేళ్లలో ఈశాన్య ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకున్నామని నరేంద్ర తెలియజేశారు. వారి మనసుల్లో ఢిల్లీతో ఉన్న దూరాన్ని తగ్గించామన్నారు. గత దశాబ్ద కాలంలో కేంద్ర మంత్రులు 700 సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారని గుర్తుచేశారు. అష్టలక్ష్మీ మహోత్సవం ఇదే మొదటిసారి. ఈ నెల 8వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ వేడుకలు జరుగుతాయి. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ఘనత, సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పడమే ఈ వేడుకల ఉద్దేశం.
Comments
Please login to add a commentAdd a comment