ఊహించని ప్రమాదం ప్రయాణికుల ఉసురు తీసింది. పట్టాలపై పరుగులు తీయాల్సిన రైలు.. ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీని నుంచి తేరుకొనే లోపే ఘటనకు గురైన రైలునే ఎదురుగా వస్తున్న మరో ట్రైను బలంగా ఢీకొంది. పదుల సంఖ్యలో మృతులు, క్షతగాత్రుల హాహాకారాలతో సాయం సంధ్య వేళ.. ప్రమాద స్థలం భీతావహంగా మారింది. బాధితులు పశి్చమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిగా భావిస్తున్నారు.
భువనేశ్వర్: తూర్పుకోస్తా రైల్వే బాలాసోర్–బహనాగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్(12841) ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొంది. ఘటనలో 12 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితులంతా హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుండగా.. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బెంగలూర్–హౌరా ఎస్‌ఎంవీటీ(12864) ఎక్స్‌ప్రెస్ రైలు కోరమండల్‌ను ఢీకొట్టింది. ఈ రెండు ప్రమాదాల్లో దాదాపు 350మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 50మందికి పైగా మృతిచెందినట్లు రైల్వేవర్గాల సమాచారం. వీరిలో పలువురు క్షతగాత్రులను సొరో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, గోపాల్‌పూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, ఖొంటపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
20మంది ఇంటర్న్, 24మంది ఇతర వైద్యులు బాలాసోర్ మెడికల్ కళాశాల, పరిసర ప్రాంతాల్లో ఆస్పత్రులు, బాలాసోర్ జిల్లా ప్రధాన ఆస్పత్రి నుంచి వైద్య, చికిత్స బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాలాసోర్ మెడికల్ కళాశాలలో 10మంది ప్రయాణికులకు చికిత్స చేస్తున్నారు. బాలాసోర్, సమీప పట్టణాల నుంచి 50కి పైగా అంబులెన్స్‌లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. జాతీయ విపత్తు స్పందన దళం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదం నేపథ్యంలో సత్వర సమాచారం అందజేసేందుకు ఈస్టుకోస్టు రైల్వే పరిధిలో హెల్ప్‌డెస్‌్కలు ఏర్పాటు చేశారు.
ప్రమాద స్థలానికి నేడు సీఎం
కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద స్థలంలో స్థితిగతులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం ఉదయం బాలాసోర్ జిల్లాలోని బహనాగా ప్రాంతానికి వెళ్లనున్నారు. ఈ ప్రమాదం అత్యంత బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు స్థానిక స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ విషయం తెలియజేశారు.
ప్రధాని మోదీ సంతాపం
రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు సాధ్యమైన సహాయం అందించబడుతుందని ప్రకటించారు.
మృతులకు పరిహారం..
రైల్వేశాఖ మంత్రి అశి్వన్ వైష్ణవ్ రైలు ప్రమాదంలో బాధితులకు పరిహారం ప్రకటించారు. మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు పరిహారంగా ప్రకటించారు.
కంట్రోల్ రూమ్‌లు..
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో అనేక కంపార్ట్‌మెంట్లు పట్టాలు తప్పి పల్టీ కొట్టాయి. కనీసం 5 కంపార్ట్‌మెంట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణిస్తున్న సుమారు 350మందికి పైగా ప్రయాణికులు ప్రభావితమయ్యారు. బాధితుల బంధు వర్గాలకు తాజా సమాచారం అందజేయానికి సత్వర సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. బాలాసోర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్, స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయంలో మరో కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రయాణికుల సమాచారం కోసం ప్రజలు బాలాసోర్ కంట్రోల్ రూమ్‌లో 67822 62286 లేదా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయంలో 0674–2534177 నంబర్‌ను సంప్రదించవచ్చు.
టోల్ ఫ్రీ ఏర్పాటు
విజయనగరం టౌన్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో విజయనగరం రైల్వేస్టేషన్‌లో బాధితుల సమాచారం తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్లను రైల్వేశాఖ ఏర్పాటుచేసింది. విజయనగరంలో 08922–221202, 221206 నంబర్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. శ్రీకాకుళంలో 08942–286213, 286245 నంబర్ల ద్వారా ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. కోరమండల్ రైలు బరంపురం తరువాత నేరుగా విశాఖలో ఆగుతుంది. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ప్రయాణికులు ఉండకపోవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment