వినాయకుడు కరోనా వైరస్‌పై త్రిశూలంతో పోరాడుతున్న ఇతివృత్తంతో రూపొందించిన విగ్రహం
కోవిడ్ థీమ్‌తో బొజ్జ గణపయ్యలు, ఫేస్‌బుక్ లైవ్ ద్వారా దర్శనాలు, ఇళ్లలోనే పూజలు, ఎక్కడికక్కడే నిమజ్జనాలు... ఈ సారి వినాయక చవితి పండుగపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడంతో ఎక్కడా సందడే కనిపించడం లేదు.
వినాయక చవితి పండుగంటే పిల్లా పెద్దల్లో ఒకటే సంబరం. గణపతి బప్పా మోరియా అంటూ వీధులన్నీ మారుమోగిపోతాయి. పెద్ద పెద్ద విగ్రహాలు, వైవిధ్యమైన రూపాలతో గణపతి రూపులు ఆకట్టుకుంటాయి. కానీ ఈసారి కరోనా వైరస్‌తో భౌతికదూరం పాటించాల్సి రావడంతో ఎక్కడా పండుగ వాతావరణమే కనిపించడం లేదు.
అంబరాన్నంటే సంబరాలు లేకపోయినా విఘ్నాల దేవుడు కరోనా నుంచి కాపాడాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు పూజలకి సిద్ధమవుతున్నారు. ఆంక్షల మధ్య గణపయ్యలను సిద్ధం చేస్తూ శనివారం నాడు తమ శక్తి కొద్దీ పండుగ చేయడానికి ఏర్పాట్లు చేశారు. గణేశ్ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించే మహారాష్ట్రలో ఈసారి ఒకేసారి అయిదుగురు భక్తులకు మించి అనుమతించకూడదని ఆంక్షలు విధించారు.
అంతేకాదు నాలుగు అడుగులకి మించి విగ్రహం పెట్టడానికి అనుమతి నిరాకరించారు. చాలా చోట్ల 10 రోజులకు బదులుగా ఒకటిన్నర రోజులో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక కరోనా వైరస్‌ని చంపేస్తున్న పోజులో గణపతులు కొలువుతీరుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వినాయకుడికి మాస్కులు కూడా తొడుగుతున్నారు. బెంగళూరులో వార్డుకి ఒక్క గణేశుడికి మాత్రమే అనుమతిచ్చారు.
మండపాల దగ్గర ప్లాస్మా కేంద్రాలు
ముంబైలో ప్రతీ ఏడాది 3 వేల వరకు గణేశ్ మండపాలు పెట్టేవారు. ఈ ఏడాది వాటి సంఖ్య 1,800కి తగ్గిపోయింది. నగరంలో సుప్రసిద్ధ లాల్‌బాగ్‌చా మండపం సమీపంలో కరోనా రోగులకు ప్లాస్మా దానం కోసం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముంబై నగర బీజేపీ శాఖ వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేకంగా రథాన్ని ఏర్పాటు చేసింది. ఆ రథంలో నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి గణేశుల్ని అందులో నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టింది.
ఢిల్లీలో జూమ్ కాల్ దర్శనాలు
ఢిల్లీలోని అత్యంత పురాతన గణేశ్ ఉత్సవ కమిటీ మరాఠి మిత్ర మండల్ ఫేస్‌బుక్, జూమ్ యాప్‌ల ద్వారా దర్శనాలకి ఏర్పాట్లు చేసింది. భక్తులు ఇంటి నుంచి దర్శించుకొని హారతి కూడా తీసుకునే సదుపా యాలు ఏర్పాటు చేసింది. ‘‘కరోనా సమయంలో గణపతి ఉత్సవాలను నిర్వహించడం అత్యంత కష్టం. అందుకే ఒకటిన్నర రోజులకే పరిమితం చేశాం. 35 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవాల్ని సాదాసీదాగా నిర్వహిస్తున్నాం’’అని ఉత్సవ కమిటీ సభ్యురాలు నివేదిత చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment