ఢిల్లీ: లోక్‌సభలో అలజడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనతో దేశంలో అరాచకం చెలరేపడమే నిందితుల అజెండా అని లలిత్ ఝ కస్టడీ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. దేశంలో అలజడి సృష్టించి తద్వారా తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని నిందితులు భావించినట్లు వెల్లడించారు. ఈ దాడి వెనక నిందితులకు ఏమైనా విదేశీ, ఉగ్రవాద సంస్థల నుంచి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే అంశంపై దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు దేశంలో అరాచకం సృష్టించాలని భావించినట్లు కీలక సూత్రధారి లలిత్ ఝా వెల్లడించినట్లు కస్టడీ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు పాటియాలా కోర్టుకు తెలిపారు. లలిత్ ఝా తన ఫోన్‌ను ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు. ఇతర నిందితుల ఫోన్‌లను ధ్వంసం చేసినట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు.
ఈ చర్య వెనక విదేశీ ప్రమేయం ఉందని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. నిందితులకు ఏదైనా శత్రు దేశంతో లేదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఝా తన ఫోన్‌ను విసిరిన, ఇతర నిందితుల ఫోన్‌లను కాల్చిన ప్రదేశాలను కనుగొనడానికి పోలీసులు రాజస్థాన్‌కు తీసుకెళ్లనున్నారు. లోక్‌సభ ఛాంబర్‌లోకి నిందితులు దూకిన ఘటనను రీక్రియేట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ అనుమతిని కోరే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ‘పార్లమెంట్ భద్రత.. ప్రభుత్వ బాధ్యత కాదు’
Comments
Please login to add a commentAdd a comment