న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహామ్మారి బారిన పడిన దాయాది దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కోవిడ్ నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ కోవిడ్ టీకా వేయించుకున్న రెండు రోజుల తర్వాత కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు పెద్దగా లక్షణాలు లేవని, స్వల్ప దగ్గు, జ్వరం మాత్రమే ఉన్నాయని ఆరోగ్య శాఖ మంత్రి పైసల్ సుల్తాన్ తెలిపారు.
ఇమ్రాన్ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. పాకిస్తాన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో టీకా వేయించుకున్న దేశ ప్రధానికి కరోనా రావటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,876 మందికి పాజిటివ్ వచ్చినట్లు, 42 మంది మరణించారని ప్రభుత్వం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment