న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్–ఏఐ)ను బాధ్యతాయుతంగా వాడుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కుటిల శక్తుల చేతిలో కృత్రిమ మేధ ఆయుధంగా మారకుండా ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, విపత్తు సహాయ చర్యలు.. తదితర విషయాల్లో ఏఐ కీలక పాత్ర పోషించనుందన్నారు. ‘రెయిజ్ 2020’ సదస్సునుద్దేశించి సోమవారం మోదీ ప్రసంగించారు. ‘కృత్రిమ మేధను ఎందుకు, ఎలా వినియోగించాలనే విషయంలో స్పష్టత అవసరం. ఏఐ వినియోగం, రూపకల్పనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి’ అని మోదీ పేర్కొన్నారు. ‘యువత కోసం బాధ్యతాయత కృత్రిమ మేధ’ కార్యక్రమాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా 11 వేల మంది విద్యార్థులు బేసిక్ కోర్స్‌ను పూర్తి చేశారని, వారిప్పుడు సొంతంగా ఏఐ ప్రాజెక్టులను రూపొందిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment