న్యూఢిల్లీ/గువాహటి: అస్సాంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడి పరిస్థితులపై ప్రధాని మోదీ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మంగళవారం ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘రాష్ట్రంలోని వరదలపై సీఎం హిమంతబిశ్వ శర్మకు ఫోన్ చేసి మాట్లాడాను. పలు ప్రాంతాల్లో వరద కారణంగా ఏర్పడిన పరిస్థితులను తెలుసుకున్నాను. కేంద్రం నుంచి చేయదగ్గ సాయమంతటిని అందిస్తాము. ప్రభావిత ప్రాంతాల్లో అందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
వరదల కారణంగా 3.63 లక్షల మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 17 జిల్లాల వ్యాప్తంగా వరదల సమస్య ఏర్పడిందని అస్సాం ప్రభుత్వం సోమవారం బులెటిన్ విడుదల చేసింది. వరద ప్రభావానికి లోనైన జిల్లాల్లో బార్‌పేట, బిశ్వనాథ్, చచార్, దారంగ్ ధెమాజి, ధూబ్రి, దిబ్రూగఢ్, గోలఘాట్, జొర్హాత్, కామ్‌రూప్, వెస్ట్ కర్బి ఆంగ్లాంగ్ లభింపూర్, మజులి, మోరిగాన్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం 950 గ్రామాలు, 30,333.36 హెక్టార్లలో పంటలు వరద నీటిలో మునిగిపోయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఆ బులెటిన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment