
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాలు, సూచనలపై అధ్యయనానికి ఏర్పాటైన కాంగ్రెస్ కమిటీ శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నివేదిక సమర్పించింది. కాంగ్రెస్ పునరుజ్జీవానికి, 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలు, తీసురోవాల్సిన నిర్ణయాలపై సోనియా, ఇతర సీనియర్ నేతల సమక్షంలో ఇటీవల పీకే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇవ్వడం తెలిసిందే. ఆయన సిఫార్సులపై అధ్యయనానికి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులతో సోనియా కమిటీ వేశారు. వారంలోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. వారిచ్చిన తాజా నివేదికపై నేతలతో సోనియా చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్ పునరుజ్జీవానికి పీకే గట్టి వ్యూహాలే సూచించారని దిగ్విజయ్ అన్నారు. ఆయన చేరికపై పార్టీలో ఎవరికీ అభ్యంతరాల్లేవని చెప్పారు. పీకే బహుశా మేలో కాంగ్రెస్‌లో చేరవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.