
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని రాష్ట్రపతి పేర్కొనగా, విజయదశమి ప్రజలకు స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నామని ప్రధాని ఆకాంక్షించారు.
అలాగే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయులందరితో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగే విజయదశమి అని, అయితే ఈ ఏడాది కొవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో దేశ ప్రజలంతా దసరా పండుగను కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఇంటివద్దనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ ద్వారా ప్రజలందరి జీవితాల్లో శాంతి, సామరస్యం వెల్లివిరిసి, శ్రేయస్సును కలుగజేయాలని ఆకాంక్షిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు. (రాయని డైరీ: నరేంద్ర మోదీ (ప్రధాని))
కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని జయిస్తామని ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో అన్నారు. స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని, పండుగ సందర్భాల్లో స్థానిక వస్తువులనే కొనుగోలు చేయమని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే జవాన్లను గుర్తు చేసుకుంటూ వారి కోసం దీపం వెలిగించాలని కోరారు.