పుణె పోర్షే కారు ప్రమాదం.. ట్విస్ట్‌ల మీద ట్వి స్ట్‌లతో థ్రిల్లర్ కథను తలపిస్తోంది. రోజురోజుకీ కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తప్ప తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు మరణించడానికి కారణమైంది 17 ఏళ్ల మైనర్ అయితే.. అతన్ని కాపాడటానికి మైనర్ తండ్రి, తల్లి, తాత, పోలీసులు, డాక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరు పైసాకు కొమ్ముకాసి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించడం చూస్తుంటే విస్మయానికి గురికాక తప్పదు.
పుణెలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు(17 ఏళ్లు).. 12వ తరగతి ఫలితాలు రావడంతో మే 18న రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగి పార్టీ చేసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మత్తులో తూలుతూనే ఇద్దరు మిత్రులను తీసుకొని తన తండ్రికి చెందిన రూ. 2.5 కోట్ల ఖరీదైన పోర్షె కారులో ఇంటికి బయల్దేరాడు.
అదే సమయంలోసాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లుగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన అనీష్, అశ్విని అనే ఇద్దరు యువతీ, యువకుడు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో టెక్కీలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోర్షె కారు నడుపుతున్న మైనర్.. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ప్రమాద తీవ్రతకు అనీష్, అశ్విని కొన్ని అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయారు. ఆ మార్గంలో వెళ్తున్న పలువురు వ్యక్తులు కారులోని యువకులను పట్టుకున్నారు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని యర్వాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బాలుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రోటోకాల్ పాటించలేదు. ప్రమాదానికి కారణమైన మైనర్‌ను పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ కుర్చీలో కూర్చొబెట్టి రాచమర్యాదలు చేయడం చూసి అక్కడే ఉన్న కొందరు ఆశ్చర్యపోయారు. పిజ్జాలను తెప్పించి నిందితులకు ఇచ్చారు. నిందితుడి ఆల్కాహాల్ శాతాన్ని పరీక్షించేందుకు సమయానికి రక్త పరీక్ష చేయడంలో పోలీసులు జాప్యం వహించారు.
అనంతరం ప్రభుత్వ ఆధ్యర్యంలో నడిచే సాసూన్ ఆసుపత్రిలోనూ మైనర్ బ్లడ్ శాంపిల్సను తారుమారు చేశారు. మైనర్ తండ్రి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకొని రక్త నమూనాలను మార్చేశాురు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా బాలుడికి తాగడానికి నీరు ఇచ్చారు. ఇది ఆల్కహాల్ స్థాయిని తగ్గిస్తుంది.
ఈ కేసు విషయంలో ఏదో జరుగుతోందని అనుమానించిన ఉన్నతాధికారులు బాలుడి రక్తనమూనాలు మరోసారి సేకరించి జిల్లా ఆస్పత్రికి పంపారు. ఈ ఫలితాల ఆధారంగానే సాసూన్ ఆస్పత్రిలో జరిగిన మోసం బయటపడింది. దీంతో ఇద్దరు వైద్యులు, వార్డ్‌బాయ్‌ను కూడా సస్పెండ్ చేశారు. అలాగే రక్తనామూనాలను తర్వగా సేకరించడంలో జాప్యం వహించిన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాలుడికి తక్షణమే బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి దన్వాడేపై విచారణ మొదలైంది.
ప్రమాదానికి కారణమైన బాలుడిని రక్షించేందుకు పోలీస్‌స్టేషన్ నుంచి జువైనల్ జస్టిస్ బోర్డు వరకూ అడుగడుగునా ప్రయత్నాలు జరిగాయి. ప్రమాదం జరిగిన మర్నాడు నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చగా.. అక్కడ న్యాయమూర్తి ఎల్‌ఎన్ దన్వాడే నిందితుడికి తక్షణమే బెయిల్ మంజూరు చేశారు. రోడ్డు ప్రమాదాలు-పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయమన్నారు. 15 రోజులు ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేయడం వంటి నిబంధనలు విధించారు ఈ బెయిల్ నిబంధనలు చూసి జనాలు నివ్వెరపోయారు.
నిందితుడికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. తక్షణమే నిందితుడి తండ్రి, మద్యం విక్రయించిన రెస్టారంట్ల యజమానులపై రెండో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 22వ తేదీన బాలుడి బెయిల్‌ను రద్దు చేసి అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. పరారైన నిందితుడి తండ్రిని ఔరంగాబాద్‌లో అరెస్టు చేశారు. మరోవైపు డ్రైవర్‌ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడి తాతను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఏకంగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment